బనగానపల్లె రూరల్: యాగంటిలో వెలసిన శ్రీ ఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో దేవదాయశాఖ ఆదేశాల మేరకు బుధవారం వరుణ జపసహిత సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ పాండురంగారెడ్డి, పాలక మండలి చైర్మన్ బండి మౌళీశ్వరరెడ్డి, అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం 108 జల కలశాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గర్భగుడిలో ఏకశిలా రూపంలో కొలువైన శ్రీ ఉమామహేశ్వర్లు మూలవిరాట్‌లు మునిగేంత వరకు 1008 బిందెలలో జలాభిషేకం చేశారు. కార్యక్రమంలో భాగంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సహస్ర ఘటాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ పాండురంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని వరుణ జపసహిత సహస్ర ఘటాభిషేకం నిర్వహించామన్నారు.


