శ్రీశైలంలో ఆగస్టు 13 నుంచి శ్రావణమాసోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో ఆగస్టు 13 నుంచి శ్రావణమాసోత్సవాలు

Jul 24 2026 1:15 AM | Updated on Jul 24 2026 1:15 AM

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో ఆగస్టు 13వ తేదీ నుంచి శ్రావణమాసోత్సవాలు ప్రారంభమవుతాయని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం శ్రావణమాసోత్సవాల ఏర్పాట్లపై అర్చకస్వాములు, వేదపండితులు, డిప్యూటీ ఈఓ, అన్ని విభాగాల యూనిట్‌ అధికారులు, పర్యవేక్షకులు, ఇంజనీరింగ్‌ అధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని విభాగాలు ముందస్తు ప్రణాళికలతో ఉత్సవ నిర్వహణకు సిద్ధం కావాలన్నారు. భక్తులందరికీ అన్నప్రసాద వితరణ, క్యూ కంపార్ట్‌మెంట్లలో తాగునీరు, బిస్కెట్లు, అల్పాహారం అందించాలన్నారు. లడ్డూప్రసాదాల కొరత లేకుండా చూసు కోవాలన్నారు. సామూహిక వరలక్ష్మీవ్రతం, శ్రావణ అఖండ శివనామ భజనలకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించాలన్నారు.

నేడు మెగా పీటీఎం

నంద్యాల: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో శుక్రవారం మెగా పేరెంట్‌–టీచర్‌ మీటింగ్‌ను నిర్వహించాలని, ఇందుకు అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులను జిల్లా కలెక్టర్‌ జి. రాజకుమారి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి మెగా పీటీఎం ఏర్పాట్లపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శుక్రవారం ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు జిల్లాలోని 1,391 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు, 80 కళాశాలల్లో ఒకేసారి మెగా పీటీఎం నిర్వహించాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, దాతలను కూడా కార్యక్రమానికి ఆహ్వానించాలన్నారు.

అమ్మవారికి బంగారు గాజుల సమర్పణ

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానానికి ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి సిద్దా రాఘవరావు దంపతులు బంగారు గాజులు సమర్పించారు. గురువారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న అనంతరం అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావుకు అందజేశారు. బంగారు గాజులతో పాటు నిత్యాన్నదాన ప్రసాద వితరణ పథకానికి రూ.3లక్షల విరాళాన్ని కూడా అందజేశారు. బంగారు గాజుల మొత్తం బరువు 186 గ్రాములు ఉంటుందని, వీటి విలువ సుమారు రూ.27లక్షలకు పైగా ఉంటుందని దాతలు తెలిపారు. అనంతరం దాత సిద్ధా రాఘవరావు దంపతులకు వేదాశీర్వచనముతో పాటు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను అందజేసి సత్కరించారు. స్వామివారి ఆలయ ప్రధానర్చకులు హెచ్‌.వీరయ్యస్వామి, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు ఎం.శ్రీధర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం

బండిఆత్మకూరు: సచివాలయ సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎల్‌డీఓ అన్వరాబేగం హెచ్చరించారు. పబ్లిక్‌ పర్సెప్షన్‌ కార్యక్రమంలో ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో గురువారం లింగాపురం గ్రామ సచివాలయాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది హాజరును, ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలు పరిశీలించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, విధులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం విధుల్లో నిర్లక్ష్యం వహించిన సచివాలయ సిబ్బందికి మెమో జారీ చేశారు. ఎంపీడీవో గాయత్రి, డిప్యూటీ ఎంపీడీవో చంద్రమౌళి పాల్గొన్నారు.

వేరుశనగ క్వింటా రూ.8,580

ఆదోని అర్బన్‌: ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో వేరుశనగకాయల ధర గురువారం క్వింటా రూ.8,580 పలికింది. యార్డుకు రైతులు 4,709 సంచులు అమ్మకానికి తీసుకురాగా గరిష్ట ధర రూ.8,580, మధ్య ధర రూ.7,456, కనిష్ట ధర రూ.3,499 నమోదైంది. అదేవిధంగా పత్తి 14 క్వింటాళ్లు అమ్మకానికి రాగా గరిష్ట ధర రూ.9,550, కనిష్ట ధర రూ.9,050 పలికింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement