● టెండర్ బిడ్ ఓపెన్..
పోటీలో మూడు కంపెనీలు
● ట్రస్ట్‌బోర్డు సభ్యులతో
సీనియర్ సభ్యుడి మంతనాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలంలో ఉత్కంఠ పెంచుతున్న సాలు మండపాల టెండర్ బిడ్‌ను దేవస్థాన అధికారులు ఎట్టకేలకు ఓపెన్ చేశారు. టెండర్ దక్కించుకునేందుకు వీఎస్‌ఎస్ కన్‌స్ట్రక్షన్స్, శ్రీకాన్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్, వరుణ్‌సాయి కన్‌స్ట్రక్షన్స్ అనే మూడు సంస్థలు పోటీలో పాల్గొన్నాయి. ఈ విషయాన్ని ఈ నెల 28న జరుగనున్న ట్రస్ట్‌బోర్డు సమావేశంలో అజెండా అంశంగా చేర్చారు. ట్రస్ట్‌బోర్డు సమావేశంలో ఏమి జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో సాలు మండపాల టెండర్‌కు ఆమోద ముద్ర వేస్తారా లేదా అనేది వేచిచూడాల్సిన విషయం. గత సమావేశాల్లో తిరస్కరించినట్లు తిరస్కరించి శ్రీశైల దేవస్థాన పాలకమండలి చైర్మన్ పంతం నెగ్గించుకుంటారో లేక సాలు మండపాల టెండర్‌కు ఆమోద ముద్ర వేయించుకుని దేవదాయశాఖ కమిషనర్, ఈఓ తమ పంతం నెగ్గించుకుంటారో వేచి చూడాలి.
పక్కా ప్రణాళిక
శ్రీశైల దేవస్థాన ప్రధాన ఆలయానికి ఎదురుగా గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు రూ.19కోట్లతో సాలు మండపాలు నిర్మించే అంశాన్ని ట్రస్ట్‌బోర్డు సభ్యులు రెండు సార్లు ఏకగ్రీవంగా తిరస్కరించారు. కమిషనర్, శ్రీశైలం ఈఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు ఏకంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన సంగతి తెలిసిన విషయమే. అయితే సాలు మండపాల టెండర్‌కు ఆమోదం తెలిపేలా దేవదాయశాఖ కమిషనర్, ఈఓ పక్కా ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఇందుకోసం ధర్మకర్తల మండలిలోని ఓ సీనియర్ సభ్యుడికి గాలం వేశారు. ట్రస్ట్‌బోర్డు సభ్యులందరితో మాట్లాడి సాలు మండపాల టెండర్ తిరస్కరించకుండా ప్రాముఖ్యత అంశాల్లో నాల్గో అంశంగా అమోదం తెలిపేలా మధ్యవర్తిత్వం చేయాలని చెప్పారు.


