● పీటీఎం పేరుతో సమావేశాలు
● విద్యార్థులకు తప్పని తిప్పలు
నంద్యాల(న్యూటౌన్): అసౌకర్యాల మధ్య ప్రభుత్వ స్కూళ్లలో శుక్రవారం పీటీఎం(పేరెంట్స్, టీచర్స్ మీటింగ్) పేరుతో సమావేశాలు నిర్వహించారు. చాలా చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులను సమావేశాలకు ఆహ్వానించలేదు. కేవలం టీడీపీ నాయకులను వేదికపై ఆశీనులై పాఠశాల కమిటీ చైర్మన్లను అవమానించారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండే స్కూళ్లకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు సరిపోక ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెయ్యి మంది విద్యార్థులకు రూ.6,750, అంతకు పైన ఉన్న విద్యార్థులకు రూ.9వేలు మాత్రమే కేటాయించారు. ఈ మొత్తంతో కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని చెప్పడం విడ్డూరంగా ఉందని కొందరు ఉపాధ్యాయులు పెదవి విరిచారు. ఇదిలా ఉండగా కేటాయించిన నిధులను ఎంఈఓల ఖాతాలో జమ చేయడంతో హెచ్‌ఎంల ఖాతాలకు బదిలీ కాక సొంతంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా మెగా పేటీఎంను నిర్వహించాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో ఒక వైపు బంద్ ప్రభావం, నిధుల కొరత, నిర్వహణ భారంతో క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు తీవ్రంగా ఒత్తిడికి గురి కావాల్సి వచ్చింది. జిల్లాలోని 1,391 పాఠశాలల్లో సమావేశాలు నిర్వహించినట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి తెలిపారు.
విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి
నందికొట్కూరు: విద్యతో పాటు క్రీడల్లో విద్యార్థులు రాణించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. నందికొట్కూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం తల్లిదండ్రుల–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తరగతి గదులను, మధ్యాహ్నం భోజనం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పిల్లలతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. సమావేశంలో మాట్లాడుతూ ఉన్నత లక్ష్యంతో విద్యార్థులు ఇష్టంతో చదవాలన్నారు. పాఠశాల హెచ్‌ఎం సావిత్ర, విద్యా కమిటీ చైర్మన్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల కమిటీ చైర్‌పర్సన్‌కు అవమానం
పగిడ్యాల: మెగా పీటీఎంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సాక్షిగా పాఠశాల కమిటీ చైర్‌పర్సన్‌కు అవమానం జరిగింది. లక్ష్మాపురం అంచె వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో శుక్రవారం మెగా పీటీఎం నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలను ఆహ్వానించి పాఠశాల కమిటీ చైర్‌పర్సన్‌ను స్టేజీ పైకి పిలువలేదు. దీంతో ఆమె వరండాలో ఒంటరిగా కూర్చోవాల్సి వచ్చింది. ఇది గ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు దళితులు అంటే చిన్న చూపా అని ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు. పిల్లలను బండలపై మండుటెండలో కూర్చోబెట్టడాన్ని తప్పుబట్టారు.


