● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి, మొక్కజొన్న పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలని పాటు వ్యవసాయ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సూచించారు. గురువారం ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ నీటి అవసరమున్న మినుము, కంది, జొన్న, సజ్జ, కొర్ర, ఆముదం వంటి పంటలను సాగు చేయించాలన్నారు. జిల్లాలో సుమారు 1.80 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటల వివరాలను ఈ–క్రాప్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. జూలై 31వ తేదీలోగా అర్హులైన ప్రతి రైతు తప్పనిసరిగా పంటల బీమాలో నమోదు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
నాల్గో రోజుకు చేరిన దస్తావేజు లేఖరుల పెన్‌డౌన్
నంద్యాల(అర్బన్): కూటమి ప్రభుత్వం తలపెట్టిన రిజిస్ట్రేషన్, స్టాంప్‌ల శాఖ ప్రైవేటీకరణను రద్దు చేయాలని నంద్యాల జిల్లా దస్తావేజు లేఖరులు చేస్తున్న పెన్‌డౌన్ కార్యక్రమం గురువారానికి నాల్గో రోజుకు చేరింది. స్థానిక ఎన్‌కే రోడ్డులో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఫరూక్, రమేష్‌లు మాట్లాడుతూ దస్తావేజు లేఖరుల జీవనోపాధికి విఘాతం కలిగించే జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. లేని పక్షంలో పెన్‌డౌన్ కార్యక్రమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఉసేన్‌బాషా, శివరాం, సుబ్రమణ్యం, సత్యం తదితరులు పాల్గొన్నారు.


