ఆశలు వదలుకోవాల్సిందే
పొలాలను దున్నలేదు
● వర్షాభావంతో
పంటల సాగుకు విరామం
● బీళ్లుగా దర్శనమిస్తున్న పొలాలు
నంద్యాల(అర్బన్): వర్షాలు లేవు.. పొలాలను దున్నలేదు.. పంటలు వేయలేదు.. ఆయకట్టు బీడుగా మారి కనిపిస్తోంది. మూడేళ్ల క్రితం వరుణుడు కరుణించి వర్షాలు పడి పంటలు బాగా పండాయి. పండించిన పంటలకు అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మద్దతు ధర కల్పించింది. చంద్రబాబు ప్రభుత్వంలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా మారింది. ఖరీఫ్‌లోనే కరువు రక్కసి కోరలు చాచింది. అదను దాటుతున్నా వర్షాల కోసం అన్నదాతలు ఆకాశం వైపు చూస్తున్నారు. జిల్లాలో అక్కడక్కడ చిన్న పాటి వర్షాలు మినహా ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. దీంతో ఈ ఏడాది ఖరీఫ్ పంటల సాగు కనుచూపు మేర కనిపించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
అరకొర సాగు
జిల్లాలోని 2.20 లక్షల హెక్టార్లలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు 67వేల హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగు అయ్యాయి. అందులో మొక్కజొన్న 20 వేలు, కంది 19 వేలు, వరి 324 హెక్టార్లలో సాగయ్యాయి. ఈ ఏడాది కేవలం బోర్లు, బావుల కింద అధిక విస్తీర్ణంలో రైతులు పంటలు సాగు చేసుకున్నారు. చాలా మంది వేసవి దుక్కులు దున్ని తొలకరి వర్షాలు పడతాయని ఆశించారు. ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు అవుతున్నా వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు ఆకాశం వైపు ఎదురు చూడాల్సి వస్తోంది. అక్కడక్కడ వరినారు పోసిన రైతులు ఎండిన పంటను చూస్తూ ఆవేదన చెందుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది పంటలు పండబోవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
ఈ ఏడాది వర్షాలు పడతాయనే ఆశ లేదు. సాలు వరి సాగు చేద్దామన్నా భూ ముల్లో పదును లేదు. ఎల్‌నినో సూపర్ ఎల్‌నినోగా మారిందని అధికారులు చెప్ప డం చూస్తే ఆందోళన చెందాల్సి వస్తోంది. ఇది వచ్చే సంవత్సరం వరకు ఉంటుందన్న శాస్త్రవేత్తల మాటలకు వ్యవసాయం చేయాలంటేనే భయమేస్తోంది. – కాశీం, రైతు, కానాల
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా వస్తాయన్న అధికారుల మాటలతో ఇంత వరకు పొలాలను దున్నలేదు. అప్పుడప్పుడు కురుస్తున్న అరకొర వర్షాలతో భూములు పదును కాలేదు. వేసవి దుక్కులు మినహా భూములను దున్నడానికి వీలు లేకుండా పోయింది. రెండేళ్ల క్రితం ఇప్పటికే పంటలు పచ్చగా కళకళలాడేవి. ఈ ఏడాది విత్తుకు భూములు నోచుకోలేదు.
– కృష్ణారెడ్డి, రైతు బిల్లలాపురం


