● అధికారుల నిర్లక్ష్యంతోనే
రోడ్డు ప్రమాదాలు
● మృతుడి కుటుంబీకులు,
బంధువుల ధర్నా
మంత్రాలయం రూరల్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలంటూ చిలకలడోణ గ్రామస్తులు, మృతుని కుటుంబీకులు మంత్రాలయం రహదారిపై ధర్నాకు దిగారు. శనివారం ఉదయం 5 గంటలకు జాతీయ రహదారిపై కారు ఢీకొని గ్రామానికి చెందిన పుట్టక వెంకటేష్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం 9 గంటలకు మృతుడి కుటుంబ సభ్యులు గ్రామస్తులు పెద్ద ఎత్తున బస్టాండ్‌కు చేరుకున్నారు. చిలకలడోణ – మంత్రాలయం జాతీయ రహదారిపై అడ్డంగా ఎద్దుల బండ్లను ఉంచి దాదాపు గంటన్నర పాటు రాస్తోరోకో, ధర్నా చేపట్టారు. ఎమ్మిగనూరు–మంత్రాలయం ఇరువైపుల రెండు కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. మంత్రాలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న సీఐ దస్తగిరిబాబు, ఎస్‌ఐ మల్లికార్జున పోలీసు సిబ్బందితో చేరుకున్నారు. నిత్యం చిలకలడోన పరిధిలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగిన జాతీయ రహదారి అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. టోల్ వసూలు చేస్తున్నా భద్రతా చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. రెండు, మూడు రోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ప్రమాదానికి కారణమైన కారును గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం ఎస్ మల్లికార్జున పోలీసు సిబ్బందితో కలసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.


