ఆళ్లగడ్డ: నవనారసింహ స్వాములు కొలువైన అహోబిల క్షేత్రం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది. స్వామి వారమైన శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎగువ, దిగువ క్షేత్రాలతో పాటు పావన క్షేత్రం తెల్లవారు జాము నుంచే భక్తులతో కిటకిటలాడింది. భక్తులు స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించా రు. దిగువ అహోబిలంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రహ్లాదవరద స్వాముల ఉత్సవ మూర్తులను పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
50 రోజులకు రూ. 52 లక్షలు
● మహానందీశ్వరుడి హుండీ
కానుకల లెక్కింపు
మహానంది: మహానందిలో నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ. 52,50,131 లభించినట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక సామూహిక అభిషేక మండపంలో శనివారం శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లతో పాటు కోదండరామాలయం, ఆంజనేయస్వామి, వినాయకనంది, అన్నప్రసాదం, గో సంరక్షణ విభాగాల్లోని భక్తులకు సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. ఆలయాల ద్వారా రూ. 51,70,417, అన్నప్రసాదం ద్వారా రూ. 55,670, గోసంరక్షణ ద్వారా రూ. 24,044 వచ్చిందన్నారు. 50 రోజులకు ఈ మేరకు ఆదాయం లభించిందని ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ హరిచంద్రారెడ్డి, ఏఈఓ ఎరమల మధు, సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, నీలకంఠేశ్వరరాజు, సుబ్బారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగమల్లయ్య పాల్గొన్నారు.
గ్రూప్–2 ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు పెంపు
కర్నూలు(అర్బన్): ఏపీపీఎస్‌సీ గ్రూప్–2 ప్రిలిమ్స్ పరీక్షల ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.ప్రసూన తెలిపారు. డిగ్రీలో అర్హత సాధించిన బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, అభ్యర్థులు తమ దరఖాస్తులను స్వయంగా వచ్చి కర్నూలులోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో అందించాలని ఆమె శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. ఎంపికై న వంద మంది అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి స్థానిక బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ ఇస్తామని, శిక్షణ పూర్తయిన అనంతరం అర్హులైన అభ్యర్థులకు స్టయిఫండ్ మంజూరవుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులు వినియోగించుకోవాలన్నారు. వివరాలకు 08518–236076, 9652093661 నంబర్లను సంప్రదించాలన్నారు.


