నంద్యాల: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం నంద్యాల పట్టణంలోని టెక్కె మార్కెట్ యార్డ్‌లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల) గోదాములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవీఎంల భద్రతకు సంబంధించిన అన్ని రక్షణ చర్యలు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా అమలవుతున్నాయా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గోదాముల వద్ద అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లు, డోర్ లాక్ సీళ్ల పరిస్థితి, సీసీ టీవీ నిఘా వ్యవస్థ పనితీరు, అగ్నిమాపక పరికరాల అందుబాటు, భద్రతా నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల భద్రత అత్యంత కీలకమైన అంశమన్నారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అన్ని భద్రతా చర్యలను నిరంతరం అప్రమత్తంగా కొనసాగించాలన్నారు. గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు లాగ్‌బుక్‌ను పరిశీలించి విధుల నిర్వహణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. భద్రతా వ్యవస్థలో భాగమైన సీసీటీవీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. ఈ తనిఖీల్లో జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్ సత్య శ్రీనివాసులు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.


