● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ‘వన్ మంత్ – ఫోర్ విజిట్’ కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను ఆగ స్టు 1వ తేదీలోపు పూర్తిస్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆళ్లగడ్డ, శ్రీశైలం నియోజకవర్గాల మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారాల పురోగతిని సమీక్షించారు. ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం మండలాల్లో ప్రధానంగా రెవెన్యూ దరఖాస్తులు అధికంగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలన్నా రు. అలాగే వెలుగోడు, మహానంది మండలాల్లో పెండింగ్‌లో ఉన్న అర్జీలను కూడా ఆగస్టు 1వ తేదీలోపు పూర్తిస్థాయిలో పరిష్కరించాలన్నారు. శుక్రవారం వెలుగోడులో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో 550 కొత్త అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ , సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు చేసిన వ్యక్తి అరెస్టు
జూపాడుబంగ్లా: ఫేస్‌బుక్‌లో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టు చేసిన జూపాడుబంగ్లాకు చెందిన డీలర్ షేక్ మహమ్మద్ అబ్దుల్ సలాంను అరెస్టు చేసినట్లు నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులకు తెలిపిన వివరాల మేరకు.. మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా ఫేస్‌బుక్‌లో అబ్దుల్ సలాం పోస్టు చేశాడని నందికొట్కూరు పట్టణానికి చెందిన సాలివేరి వెంకటేష్ ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టి డీలర్ సలాంను అదుపులోకి తీసుకున్నామన్నారు. తన తప్పును నందికొట్కూరు సర్కిల్ పోలీసుస్టేషన్‌లో ఒప్పుకొని క్షమాపణలు కోరుతూ అదే ఫేస్‌బుక్ ఖాతాలో పో స్టు చేశాడన్నారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.
గ్రామాలను
పరిశుభ్రంగా ఉంచాలి
బనగానపల్లె రూరల్: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని జెడ్పీ సీఈఓ సుధాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పాతపాడు గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఘన వ్యర్థ పదార్థాల సేకరణ (ఎస్‌డబ్యూపీసీ) షెడ్డును పరిశీలించి, షెడ్డులో తడి, పొడి చెత్త సేకరణ ద్వారా వర్మికంపోస్టు ఎరువులను ఎలా తయారీ చేయాలి తదితర అంశాలను గ్రామ పంచాయతీ సిబ్బందికి తెలియజేశారు. అలాగే గ్రామ సచివాయాలన్ని తనిఖీ చేసి అక్కడి సిబ్బంది వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈఓ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలో సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, గ్రామంలో ఎక్కడ అపరిశుభ్రత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నాగరాజు, డిప్యూటీ ఎంపీడీఓలు సురేంద్రనాథ్‌యాదవ్, తిరుమలేష్ రెడ్డి, ఏవో అబ్దుల్ హమ్మిద్, పంచాయతీ కార్యదర్శి శకుంతల గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
శిరివెళ్ల: మోత్కులపల్లె గ్రామ పొలాల్లో విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మహానంది మండలం మసీదుపురానికి చెందిన రైతు డమాల్ నాగన్న (60) మోత్కులపల్లె సమీపంలోని తన పొలంలో సాగు చేసిన మినుము పంటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. మోటార్‌ను ఆన్ చేయటానికి వెళ్తూ మోటార్ నుంచి బోరుకున్న వైర్‌కు జాయింట్ ఉన్న చోట గమనించకుండా తొక్కాడు. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు అంకాలు పోలీసుల కు సమాచారం ఇవ్వగా ఎస్‌ఐ మధుసూదన్ ఘట న స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


