● ఆలస్యంగా వెలుగులోకి
● వైద్యుల నిర్లక్ష్యమేనని
బంధువుల ఆందోళన
డోన్: స్థానిక ప్రభుత్వాసుపత్రిలో సకాలంలో వైద్యం అందక తల్లీబిడ్డ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణగిరి మండలం పెనమాడ గ్రామా నికి చెందిన అనురాధా(20)కు అదే మండలం ఎరుక ల చెరువు గ్రామానికి చెందిన మహేష్‌తో గత ఏడాది వివాహమైంది. నెలలు నిండిన అనురాధ కాన్పు కోసం ఈ నెల 13వ తేదీ ఉదయం డోన్ ప్రభుత్వాసుపత్రిలో చేరింది. గర్భిణి ప్రసవ వేదనతో బాధపడుతుండగా ఆ సమయంలో డ్యూటీ డాక్టర్ లేకపోవడంతో విధుల్లో ఉన్న నర్సు కాన్పు చేసిందని మృతురాలు బంధువులు తెలిపారు. కాన్పులో మృత శిశువును తమకు అప్పగించి, అనురాధకు తీవ్ర రక్త స్రావమై పరిస్థితి విషమంగా ఉంది కర్నూలుకు తీసుకెళ్లాలని పురమాయించిందన్నారు. ఆ మేరకు కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిందని అనురాధ భర్త మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో గైనిక్ వార్డులో మహిళా డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్లనే తన భార్య మృతి చెందిందని ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి తమ కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. డోన్ ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఈ సంఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హానీఫ్‌ను వివరణ కోరగా.. 13వ తేదీ రాత్రి గైనిక్ వార్డులో డ్యూటీ డాక్టర్ లేకపోవడంతో హెడ్ నర్స్ హేమలత కాన్పు చేసిందనడంలో వాస్తవం లేదన్నారు. అనురాధ కా న్పు అయిన వెంటనే మృత శిశువుకు జన్మనివ్వడం, ఆమెకు అధిక రక్త స్రావమై, ఫిట్స్ రావడం లాంటి కారణాలతో కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్య లో మృతి చెందినట్లు సమాచారం ఉందన్నారు. తల్లీబిడ్డ మృతికి ఆసుపత్రి వైద్యసిబ్బంది కారణమని ఇంత వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు.


