● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ప్రత్యేక విస్తృత ఓటర్ల జాబితా సవరణ (సర్) కార్యక్రమాన్ని వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. అమరావతి వెలగపూడిలోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గురువారం సర్ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ సంబంధిత ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో ప్రత్యేక టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఇచ్చిన ప్రతి సూచనను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. బీఎల్‌ఓల వద్ద పెండింగ్‌లో ఉన్న (బుక్ ఏ కాల్ విత్ బీఎల్‌ఓ), ఇతర పెండింగ్ అంశాలను తక్షణమే పూర్తి చేయాలన్నారు. ఓటర్ల ఫొటోలు స్పష్టంగా లేకపోయినా, పాత ఫొటోలు ఉన్నా వాటి స్థానంలో తాజా కలర్ ఫొటోలను అప్‌డేట్ చేయాలన్నారు. వచ్చే శనివారం మరోసారి సమీక్ష నిర్వహిస్తానని, అప్పటిలోపు గణనీయమైన పురోగతి సాధించాలన్నారు. ఎన్నికల జాబితాల కచ్చితత్వం, పారదర్శకతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ ప్రతి పనిని నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి డి. రామునాయక్, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


