బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారిగణియా బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పీవీకుమార్‌రెడ్డి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో జిల్లా కలెక్టర్‌కు ఘనస్వాగతం పలికారు. పూజల అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాన్ని అందజేశారు.
ఎస్పీని కలిసిన ఏఎస్పీ
బొమ్మలసత్రం: ఎస్పీ సునీల్ షెరాన్‌ను ఏఎస్పీగా బదిలీపై వచ్చిన ఐపీఎస్ అధికారి సుస్మిత బుధవారం స్థానిక కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నంద్యాల సబ్‌డివిజన్‌కు సంబంధించి నేరాల కట్టడిపై చర్చంచుకున్నారు. ఈమె ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెం నుంచి సాధారణ బదిలీపై నంద్యాలకు వచ్చారు.
అవుకులో
0.7 టీఎంసీల నీరు
కొలిమిగుండ్ల(అవుకు): అవుకు రిజర్వాయర్ నీటి సామర్థ్యం 4.18 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.7 టీఎంసీలకు పడిపోయాయి. రిజర్వాయర్ బండ్ కింద లీకేజీ కారణంగా నీళ్లు వృథా అవుతున్నాయి. అధికారులు లీకేజీని అరికట్టేందుకు చర్యలు చేపట్టిన 30 శాతం మాత్రమే లీకేజిని అరికట్టగలిగారు. ఇంకొన్ని రోజులుపోతే రిజర్వాయర్ పూర్తిగా ఖాళీ అయిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతేడాది రెండు సార్లు రివిట్‌మెంట్ కుంగిపోయిన కారణంగా 4 టీఎంసీలు ఉండగా గాలేరి –నగరి వరద కాల్వ ద్వారా రెండు టీఎంసీలకు పైగానే వైఎస్సార్ కడప జిల్లాకు వదిలారు. ఈఏడాది జలసంక్షోభం కారణంగా వరి సాగు చేసే రైతుల్లో ప్రశ్నార్థకంగా మారింది. కనీసం నారుమళ్లు పోసుకునేందుకు కూడా నీళ్లు లేక పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
కేజీబీవీని తనిఖీ చేసిన డీఈఓ
కొత్తపల్లి: స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం డీఈఓ జనార్దన్ రెడ్డి తనిఖీ చేశారు. విద్యార్థినులతో విడివిడిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడం, నీటి సమస్య ఉండటాన్ని చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులకు ఇచ్చే స్నాక్స్‌లో పురుగులు రావడం నిజమేనని తేలింది. భోజనంలో సాంబారు, రసం, మజ్జిగ తగినంతగా వడ్డించడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేయడంతో సిబ్బందిలో ఒకరిని తొలగించారు. మధ్యాహ్న భోజనం రుచి చూసి.. మెనూ, నాణ్యత పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పాఠశాలను జిల్లా ఫుడ్‌సెఫ్టీ అధికారి వెంకటరమణ ఆకస్మీకంగా తనిఖీ చేశారు. వీరి వెంట తహసీల్దార్ ఉమారాణి, జీసీడీఓ జ్యోతి, మండల విద్యాధికారి నాగరాజు ఉన్నారు.
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో 2025 నవంబర్‌లో జరిగిన బీఎడ్ మూడవ సెమిస్టర్ పరీక్షల రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఫలితాలు https://rayalaseemauniversity.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. 654 మంది రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోగా 189 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.


