వాతావరణ బీమాకు బుధవారం చివరి రోజు
కర్నూలు(అగ్రికల్చర్): వాతావరణ ఆధారిత బీమా పథకంలో భాగంగా పత్తి, వేరుశనగకు ప్రీమియం చెల్లింపు గడువు బుధవారంతో ముగుస్తుండటంతో మీ సేవ కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు రైతులతో కిక్కిరిశాయి. ప్రీమియం చెల్లింపునకు 3 రోజులే అవకాశం ఇవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్వస్ సమస్యలు, రైతుల తాకిడి ఎక్కువగా ఉండటంతో గంటల తరబడి వరుసలో నిల్చోవాల్సి వచ్చింది. 2019–20 నుంచి 2023–24 వరకు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం రైతుల నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయకుండా ఉచిత పంటల బీమా అమలుచేసి పరిహారం కూడా విడుదల చేసింది. ఎల్‌నినో వంటిి కష్టకాలం ఏర్పడినప్పడు రైతులకు ఉచిత పంటల బీమా అవసరమైనప్పటికీ చంద్రబాబు మాత్రం పత్తికి ఎకరాకు రూ.2వేలు, వేరుశనగకు రూ.560 చెల్లించే విధంగా బీమాను అమలు చేస్తుండటం గమనార్హం. బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకునే రైతులకు ప్రీమియం చెల్లింపు గడువు ఈ నెల చివరి వరకు పొడిగించిన ప్రభుత్వం.. నాన్‌లోనీ ఫార్మర్స్‌ను మాత్రం విస్మరించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో లోనీ ఫార్మర్స్‌కు సైతం కొన్ని బ్యాంకులు పంటల బీమా అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పంట రుణాలు పొందిన రైతులు సైతం నాన్ లోనీ కింద ప్రీమియం చెల్లిస్తున్నారు. అందువల్లే మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు కిక్కిరిసినట్లు సమాచారం. వాతావరణ బీమా కింద 21,941 రైతులు ప్రీమియం చెల్లించారు. ఇందులో బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందిన రైతుల దరఖాస్తులు 1,445 ఉండగా.. 36,596 బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందని రైతుల దరఖాస్తులు ఉన్నాయి. అంటే పంటల బీమా పట్ల బ్యాంకుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద 4,390 మంది రైతులు ప్రీమియం చెల్లించారు.
సర్వర్ సమస్యలతో కిక్కిరిసిన
మీసేవ కేంద్రాలు
గంటల తరబడి నిరీక్షించిన రైతులు
చంద్రబాబు ప్రభుత్వ తీరుతో
అన్నదాతల ఆగ్రహం


