● జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి
కర్నూలు(సెంట్రల్): గుండ్రేవుల ప్రాజెక్టు అంతర్రాష్ట్ర సమస్యలతో కూడుకున్నది కావడంతో దానిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి పనులు చేపట్టాలని దిశా మీటింగ్ తీర్మానం చేయాలని జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నీటి సమస్యకు రిజర్వాయర్ల నిర్మాణమే శాశ్వత పరిష్కారమన్నారు. గత ఏడాది ఆశించిన వర్షపాతం, వరదలు వచ్చినప్పటికీ తగినన్ని రిజర్వాయర్లు లేకపోవడంతో ఆ నీటిని నిల్వ చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అధ్యక్షతన దిశాకమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, పాణ్యం, ఆదోని ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, డాక్టర్ పి.పార్థసారథి, దిశా కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడుతున్నాయని, ఈ సంవత్సరం ఖరీఫ్‌పై ఆశలు వదులుకునే పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. రాబోయే రబీకి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో వలసలు పెరిగే అవకాశం ఉండడంతో ఉపాధి పనులను కల్పించాలని సూచించారు.


