ఆళ్లగడ్డ: ఎర్రగుంట్ల ఎంపీపీ స్కూల్‌కు సంబంధించిన మొత్తం స్థలాన్ని సర్వే చేసి హద్దు చూపించాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు డిప్యూటీ డీఈఓ శంకరప్రసాద్ తెలిపారు. శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల ఎంపీపీ స్కూల్ స్థలం కబ్జాపై ఈ నెల 11న సాక్షిలో ‘తెగబడిన పచ్చ నేత’ శీర్షిక కథనం ప్రచురితమైంది. స్పందించిన విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం డిప్యూటీ డీఈఓ పాఠశాల స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థలం కబ్జాకు గురైందా లేదా అన్న విషయం తెలుసుకునేందుకు పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ ద్వారా సర్వే చేసి కొలతలు కొలిచి పాఠశాల హద్దులు చూపించాలని పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేయించామన్నారు. సర్వే అనంతరం పాఠశాల స్థలం ఆక్రమణకు గురైతే కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం పాఠశాలకు రెండే గదులు ఉన్నాయని, మూడు అదనపు గదులు కూడా మంజూర య్యాయని, సర్వే చేసిన అనంతరం గదుల నిర్మాణం చేపడుతామన్నారు.
● కాగా విచారణకు వచ్చిన అధికారులు కబ్జా చేసిన అధికార తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మంతనాలు జరిపి అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించడంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ చేత సర్వేకు అర్జీ ఇవ్వమని చెప్పడం అధికారుల చిత్తశుద్ధిపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.


