శ్రీశైలంటెంపుల్: అషాఢపౌర్ణమి సందర్భంగా ఈ నెల 29న భ్రమరాంబాదేవికి శాకంభరీ ఉత్సవం నిర్వహించనున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం దేవస్థాన పరినాలన భవనంలో ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, వేదపండితులు, స్థానాచార్యులు(అధ్యాపక), డీఈఓ, అన్ని శాఖల అధిపతులు, అన్ని విభాగాల పర్యవేక్షకులతో శాకంభరీ ఉత్సవ ఏర్పాట్లపై సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ లోకకల్యాణం కోసం జరిపే ఉత్సవంలో ఆయా కై ంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరిపించాలని వైదిక సిబ్బందికి సూచించారు. ఉత్సవానికి కనీసం నలబై రకాల అకుకూరలు, కూరగాయలను, పండ్లను తెప్పించాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. భ్రమరాంబాదేవితో పాటు ఆలయ ప్రాంగణంలో రాజరాజేశ్వరి అమ్మవారిని, గ్రామదేవత అంకాళమ్మను కూడా శాకంభరీ అలంకరణలో విశేష పూజలు నిర్వహించాలరు. ఈ నెల 29న అమ్మవారి ఆర్జిత కుంకుమార్చనలను పూర్తిగా నిలుపుదల చేయాలని అదేశించారు.
జిల్లా ట్రెజరీ అధికారిణిగా సరస్వతి
నంద్యాల(అర్బన్): జిల్లా ఖజానా, గణాంక శాఖ అధికారిణిగా సరస్వతి సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లా కల్యాణ దుర్గంలో సహాయ ఖజానా అధికారిణిగా పని చేస్తూ పదోన్నతిపై నంద్యాల జిల్లాకు వచ్చారు. జిల్లా ట్రెజరీ అధికారిణిగా పని చేస్తున్న లక్ష్మీదేవి నెల్లూరు జిల్లా ఉపసంచాలకులుగా పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సంఘం నాయకులు సునీల్, శేఖర్ తదితరులు గణాంక అధికారి సరస్వతిని మర్యాదపూర్వకంగా కలిశారు.
జెడ్పీ సీఈఓగా సుధాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ సీఈఓగా ఆర్.సుధాకర్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ రెగ్యులర్ సీఈఓగా విధులు నిర్వహించిన జీవీ రమణారెడ్డి గత జూన్ 30న పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి సీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 11న సెర్ఫ్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్.సుధాకర్ రెడ్డిని జెడ్పీ సీఈఓగా నియమిస్తూ పీఆర్ అండ్ ఆర్డీ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కాంతిలాల్ దండె ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరిని గౌరవపూర్వకంగా కలసి బాధ్యతలు స్వీకరించారు.
చెక్‌బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా కోర్టుల ప్రాంగణాల్లో ఈనెల 18న చెక్‌బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ప్రజలకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో 2026 జులై 18న కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని అన్ని న్యాయస్థానాల్లో పెండింగ్ చెక్‌బౌన్స్ కేసులు మాత్రమే పరిష్కరించుకోవడానికి ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
డీఎల్‌డీ ప్రవేశాలకు నేటి నుంచి వెబ్ ఆప్షన్స్
కర్నూలు సిటీ: ప్రభుత్వ, ప్రైవేట్ డీఎల్‌డీ కాలేజీల్లో ప్రవేశాలకు నేటి (మంగళవారం) నుంచి 18వ తేదీలోపు వెబ్ ఆధారిత అప్షన్స్ ఇవ్వాలని ప్రభుత్వ డీఎల్‌డీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆయూబ్ హుసేన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్–ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు సీట్ల కేటాయింపు చేస్తారని తెలిపారు. వీరంతా 24 నుంచి 29వ తేదీ వరకు ప్రభుత్వ డైట్ కాలేజీలో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించాలని పేర్కొన్నారు.


