రుద్రవరం: మిర్చి పంట సాగు చేసిన రైతులకు ఈ ఏడాది కలిసి రాలేదు. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటసాగు చేస్తే వాతావరణం అనుకూలించక పోవడంతో తొలగించాల్సి వస్తోంది. మండల కేంద్రమైన రుద్రవరంతో పాటు రెడ్డిపల్లె, ఆర్.నాగులవరం, నర్సాపురం, అప్పనపల్లె, పెద్దకంబలూరు ఆలమూరు తదితర గ్రామాల పరిధిలోని రైతులు బోరు మోటర్ల కింద ఈ ఏడాది మే నెలలో మిర్చి సాగుచేశారు. పంట సాగు చేసి 60 రోజులైనా పూత, పిందె రాలేదు. తెగుళ్లు సోకి పూత పిందె రావండం లేదు. దీంతో రైతులు ఇక దిగుబడులు రావన్న ఆశలు వదులుకుని ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. మండలంలో దాదాపు వెయ్యి ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. అయితే అందరి పరిస్థితి ఇలాగే ఉంది.


