రుద్రవరం: మట్టి మాఫియా అవతారమెత్తిన తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వ భూములే కాదు.. కాల్వ గట్లనూ వదలడం లేదు. ఎక్కడ బడితే అక్కడ యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఏకంగా తెలుగుగంగ కాల్వ కట్టపై కన్నేశారు. రుద్రవరం మండలం కే.కొత్తూరు గ్రామ సమీపంలో తెలుగుగంగ 16వ బ్లాక్ ఉప ప్రధాన కాల్వ కట్టను ఆక్రమించారు. జేసీబీతో గట్టు మట్టిని తవ్వి ఒక్కో ట్రాక్టర్ దాదాపు రూ.800 ప్రకారం విక్రయించారు. కట్ట పొడవునా మట్టిని తవ్వి తరలించడం చదునైనా భూమిని ఆక్రమించి పొలముగా మార్చి విత్తు విత్తేందుకు సిద్ధం చేశారు. ఇంత జరుగుతున్నా తెలుగుగంగ అధికారులు ఏమీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. గట్టు వెంబడి పొలాలకు వెళ్లే రస్తాను ఆక్రమించారని రైతులు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫిర్యాదుదారులను ఆక్రమణదారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని కాల్వ కట్టను మరింత బలోపేతం చేయాలని రైతులు కోరుతున్నారు.


