ఆదోని ప్రజల ఉసురు టీడీపీకి తప్పదు
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి శశికళ
ఆలూరు: ఆదోని జిల్లా ఏర్పాటులో నిర్లక్ష్యం వహించిన అధికార టీడీపీకి ఈ ప్రాంత ప్రజల ఉసురు తప్పక తగులుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి శశికళ విమర్శించారు. నియోజకవర్గ కేంద్రమైన ఆలూరులో అంబేడ్కర్ సర్కిల్ సమీపంలో ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటి సభ్యులు కత్తి రామాంజనేయులు ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరహారదీక్షలు బుధవారం నాటికి 20 రోజులకు చేరకున్నాయి. ఈ సందర్భంగా నియోజకవర్గం మాల మహా నాడు సంఘం నాయకులు ఈరన్న, లక్ష్మీనారాయణ, తిక్కన్న, హాలహర్వి సర్పంచ్ మల్లికార్జున, వన్నూరు, వెంకటరాముడు తదితరులు రిలే నిరహారదీక్షలలో కూర్చున్నారు. వీరికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి శశికళ, కృష్ణమోహన్, ఎరువులు వ్యాపారి అశోకానందరెడ్డి, సీపీఐ జిల్లా నాయకులు భూపేష్, వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి గూళ్యం ఎల్లప్ప తదితరులు మద్దతు పలికారు. ఆదోని జిల్లా ప్రకటించకపోవడంతో మంత్రాలయం రాఘవేంద్రస్వామి, ఆదోని లక్ష్మమ్మవ్వ, ఉరుకుంద ఈరన్నస్వా మి, దేవరగట్టులో కొలువు దీరిన శ్రీ మాళమల్లేశ్వరస్వామి, గూళ్యం గాదిలింగప్ప, పెద్దహోతూరు ఉచ్చీరప్పతాతాలు టీడీపీ నేతలను మన్నించరని ఆమె జోష్యం చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు సమస్యను స్థానిక నేతలపై నెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. అంతక ముందు రోడ్డు పైనే వంట వార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనతో రహదారిలో అర గంటపాటు నిలిచిపోయాయి.


