పోలీసులపై చర్యలేవి?
పత్తికొండ: గంజాయి కేసులో కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన నిందితుడిని అరెస్ట్ చేసే విషయంలో న్యాయస్థాన ప్రాంగణంలో దౌర్జన్యకాండకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాదులు మూడో రోజు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. బుధవారం గుత్తి రోడ్డు సర్కిల్ వరకు చెడు వినకు–చెడు చూడకు–చెడు మాట్లాడకు అనే ప్లకార్డులును ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. న్యాయవాదులు నరసింహ ఆచారి, రవికుమార్, సాంబశివ మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులను పోలీసులు ఉల్లంఘనకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గంజాయి కేసులో నిందితుడికి న్యాయవాదులు వత్తాసు పలకడం లేదని, సరెండర్ పిటీషన్ దాఖలు చేసినందున.. చట్టపరిధిలో శిక్షించాలని మాత్రమే కోరామన్నారు. అయితే అరెస్ట్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు న్యాయవ్యవస్థను భయబ్రాంతులకు గురి చేయడేమేనని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేయడంలో విఫలమైన పోలీసులు, న్యాయవ్యవస్థను అగౌరవ పరచడం దారుణమన్నారు. అక్రమ అరెస్ట్‌కు పాల్పడిన పత్తికొండ, చిప్పగిరి ఎస్‌ఐలు విజయ్‌కుమార్ నాయక్, సతీష్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటన జరిగి 7రోజులు గడిచినా వారిపై కేసు నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులు పాల్గొన్నారు.


