శ్రీశైలంటెంపుల్: ‘సాక్షి’ దిన పత్రికలో శనివారం ‘భగవంతుడా.. ఇదేమి భద్రతా’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు స్పందించారు. దేవ స్థాన భద్రతా విషయాలపై సమగ్ర పరిశీలన చేయాలని దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నరసింహారెడ్డిని ఈఓ ఆదేశించారు. ఈ మేరకు ఆయన క్యూలైన్ల వద్దకు చేరుకుని.. క్యూలైన్ ఏఈఓ, పర్యవేక్షకులు, భద్రతా పరికరాల పర్యవేక్షణ చేపట్టే ఇంజినీర్లు, సెక్యూరిటీ సూపర్ వైజర్ల తో సమీక్షించారు. మెటల్‌డోర్ ఫ్రేమ్ డిటెక్టర్లు కొన్ని పనిచేయడం లేదని, హ్యాండ్ డిటెక్టర్లు ఉన్నా.. వినియోగించేందుకు సిబ్బంది తక్కువ ఉన్నారని గుర్తించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భద్రతా ఏర్పాట్లు మరింత మెరుగుపరుస్తామన్నారు. లగేజ్ స్కానర్లు సైతం వినియోగంలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.