గుంతకల్లుకు మరో రైలు
డోన్ టౌన్: ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి నంద్యాల, డోన్ మీదుగా గుంతకల్లుకు కొత్త రైలు మంజూరైనట్లు రైల్వే అధికారులు తెలి పారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ప్రత్యేక చొరవతో ఈ ట్రైనుకు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్నారు. మార్కాపురంలో ప్రతి రోజు (ట్రైన్ నంబరు 57408) తెల్లవారు జామున 4.30 గంటలకు బయలుదేరి నంద్యాలకు ఉదయం 7.20 గంటలకు చేరుకుని, ఆ తర్వాత డోన్ మీదుగా గుంతకల్లుకు 10.30 గంటలకు చేరుకుంటుందన్నారు. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో (57407) గుంతకల్లులో సాయంత్రం 5.30 గంటలకు బయలుదే రి డోన్ మీదుగా నంద్యాలకు రాత్రి 8.30 గంటలకు చేరుకుని మార్కాపురానికి రాత్రి 10.30 గంటలకు చేరుకుంటుందని వివరించారు.
పరివార దేవుళ్లకు పూజలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీస్వామిఅమ్మవార్ల ఆలయ ప్రాంగణంలోని శనగల బసవన్నగా పేరుపొందిన నందీశ్వరునికి, శ్రీశైలక్షేత్రపాలకునిగా ప్రసిద్ధిగాంచిన శ్రీబయలు వీరభద్ర స్వామి వారికి మంగళవారం శాస్త్రోక్తంగా ఆలయ అధికారులు, అర్చకులు విశేషపూజలను నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రదోషకాల సమయంలో క్షేత్రపాలకుడైన వీరభద్రునికి, నందీశ్వరునికి పంచామృతాలతో అభిషేకాది అర్చనలను నిర్వహించారు. ఆరంభ పూజల్లో భాగంగా లోక క్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగేందుకు గణపతి పూజను చేశారు. తరువాత నందీశ్వర స్వామికి నూతన వస్త్రసమర్పణ విశేషార్చనలను, నానపెట్టిన శనగలను, క్షేత్రపాలకునికి ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పించి కర్పూర నీరాజనాలు అర్పించారు.
బాల్య వివాహాలు అనర్థదాయకం
డోన్ టౌన్: బాల్య వివాహాలు అనర్థదాయకమని, వాటితో సమాజాభివృద్ధి వెనుకబడుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు. మంగళవారం పట్టణంలోని బాలికల హైస్కూల్‌లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా, పెళ్లికి హాజరైనా చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. బాల్య వివాహాల వలన బాలికలు విద్యకు దూరం కావడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. సమాజంలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనాన్నారు. ఎక్కడైనా ఇలాంటి వివాహాలు నిర్వహిస్తుంటే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన వయస్సు ప్రకారం బాలురకు 21, బాలికలకు 18 ఏళ్లు నిండాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ సీడీపీఓ శంషాద్‌బేగం, న్యాయవాది మాధవస్వామి, హెచ్‌ఎం మైమున్నీసా బేగం, సూపర్ వైజర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
వామ్మో...కొండచిలువ
మహానంది: బుక్కాపురం గ్రామంలో లక్ష్మీనరసమ్మ కుటుంబ సభ్యుల ఫామ్ హౌస్ వద్ద మంగళవారం కొండచిలువ కనిపించడంతో హడలిపోయారు. అయ్యన్న నగర్‌కు చెందిన స్నేక్ క్యాచర్ మోహన్‌కు సమాచారం అందించారు. అతను గ్రామానికి చేరుకుని సుమారు పది అడుగుల పొడవున్న కొండ చిలువను చాకచక్యంగా పట్టుకుని సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేశాడు.
బీఈడీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్ నెలలో జరిగిన బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశారు. వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు ఫలితాలు ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. 2,474 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోగా 2,016 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు.
గుంతకల్లుకు మరో రైలు
గుంతకల్లుకు మరో రైలు


