మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించండి
● ఆర్జేడీ శామ్యూల్
వెలుగోడు/బండిఆత్మకూరు: మధ్యాహ్న భోజనంలో తప్పనిసరిగా నాణ్యత పాటించాలని విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్ ఆదేశించారు. మంగళవారం వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బండిఆత్మకూరు జిల్లా పరిషత్ హైస్కూల్, వీవర్స్ కాలనీలోని మోడల్ ప్రైమరీ స్కూల్‌ను ఆయన తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వెలుగోడులో ఆయన స్వయంగా మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి నాణ్య తను పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థుల కోసం అమలవుతున్న వంద రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఆయన పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను విడివిడిగా ప్రశ్నించి శిక్షణ పురోగతిని తెలుసుకున్నారు. పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు విద్యార్థులకు సమర్థవంతమైన బోధన అందించాలని, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. పాఠశాల నిర్వహణకు సంబంధించిన రికార్డులు, హాజరు పట్టికలు, అకడమిక్ రికార్డులను కూడా ఆర్జేడీ తనిఖీ చేశారు ఆయన వెంట డిప్యూటీ డీఈఓలు శంకర్ ప్రసాద్, వెంకటరామిరెడ్డి, మండల విద్యాధికారులు బ్రహ్మం నాయక్, నాగ బ్రహ్మయ్య, మోహన్ రెడ్డి, హెడ్ మాస్టర్ నూర్జహాన్, ఇన్‌చార్జ్ హెడ్‌మాస్టర్ మొయినుద్దీన్, ఉపాధ్యాయులు ఉన్నారు.


