గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
బండిఆత్మకూరు: చెంచుగూడేల్లోని గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు అధికారులు చర్య లు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా సూచించారు. మండలంలోని నెమళ్ల కుంట గిరిజన గూడాన్ని ఆమె మంగళవారం సందర్శించారు. చెంచుల జీవన విధానం, కుటుంబ పరిస్థితులు తదితర వివరాలపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 44 చెంచు గూడేల్లో 9 వేల మంది గిరిజనులు జీవిస్తున్నారన్నారు. వీరందరికి జీవనోపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్‌మెట్ సెంటర్‌లు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. వాటి ద్వారా పేపర్ ప్లేట్లు, జ్యూట్ బ్యాగ్‌లు, అగర్ వత్తుల తయారీ వంటి వాటిపై శిక్షణ ఇచ్చి జీవనోపాధి కల్పించనున్నామని తెలిపారు. చెంచులు సారా తయారీ, చెడు వ్యసనాల బారి నుంచి దూరం చేసేందుకు చర్య లు చేపడుతున్నామన్నారు. గూడేలకు ఆర్‌ఓ ప్లాంట్‌ల ద్వారా మంచి నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఉజ్వల పథకం కింద గూడెంలోని 40 కుటుంబాలకు గ్యాస్ స్టవ్‌లను అందజేశారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ రవి బాబు, తహసీల్దార్ పద్మావతమ్మ, ఎంపీడీఓ గాయత్రి, పంచాయతీ రాజ్ ఈఈ నాగరాజు, డీఈ ఆయాజ్ బాషా తదితరులు పాల్గొన్నారు.


