ఉత్సాహంగా రైతు మహా ప్రదర్శన
రైతు సమస్యలపై మహాసభల్లో చర్చిస్తాం : విజూకృష్ణన్
నల్లగొండ టౌన్ : తెలంగాణ సాయుధ పోరాట పురిటిగడ్డ అయిన నల్లగొండలో కర్షక లోకం కదం తొక్కింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై పోరుబాట పట్టేందుకు అన్నదాతలు సమరశంఖం పూరించారు. అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభల ప్రారంభం సందర్భంగా ఆదివారం నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు వేలాది మంది రైతులు తరలివచ్చారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం జాతీయ నేత, మాజీ ఎంపీ బృందాకరత్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పేదలకు వేలాది ఎకరాల భూమిని పంపిణీ చేసిన ఘనత కమ్యూనిస్టులదే అన్నారు. ఆనాడు దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, రావి నారాయణరెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం తదితర యోధుల సాయుధ పోరాటం కారణంగానే నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగిందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మోకరిల్లుతూ దేశంలోని భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటయోధుల స్ఫూర్తితో ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
కరువు నివారణ చర్యలేవీ: పోతినేని సుదర్శన్
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో రెండు నెలల్లో స్పష్టం చేయకపోతే ఇతర రైతు సంఘాలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 365 మండలాలను కరువుమండలాలుగా ప్రకటించింది.. కానీ, కరువును ఎదుర్కొనేందుకు ఏం చర్యలు తీసుకుంటారో సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్ మాట్లాడుతూ రైతులకు పసల్ బీమా యోజనను వెంటనే అమలు చేసి ఎల్‌నినో వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలు మార్చుకోకపోతే రైతాంగం ఏకమై గద్దె దించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం కౌలు రైతులకు పట్టాలు ఇచ్చి రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మోదీ హటావో.. దేశ్‌కు బచావో..
: జూలకంటి రంగారెడ్డి
ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఈ సభకు అధ్యక్షత వహించి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేలా, దేశాన్ని రక్షించుకునేలా మోదీ హటావో.. దేశ్‌కు బచావో అనే నినాదంతో అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు నల్లగొండలో ప్రారంభం అయ్యాయని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, దేశాన్ని అన్నం పెట్టి పోషిస్తున్న రైతన్నకు ఇవాళ కనీసం పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సభలో జాతీయ నాయకులు హన్నన్ మొల్లా, ఎంపీ అమరారామ్, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, పుణ్యవతి, నల్లగొండ మాజీ శాసనసభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర నాయకుడు సాయిబాబా, నాయకులు ప్రసాద్, వినోద్‌సింగ్, హరిసింగ్, బాలగోపాల్, జయరాజన్, విజయ్‌కుమార్, మరియన్, శ్రీమతి, మల్లు లక్ష్మి, తుమ్మల వీరారెడ్డి, మల్లు నాగార్జునరెడ్డి, నారి ఐలయ్య, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
రామగిరి(నల్లగొండ) : ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) మహాసభల్లో భాగంగా ఆదివారం పట్టణంలో రైతు మహా ప్రదర్శన ఉత్సాహభరితంగా సాగింది. ఈ ర్యాలీ నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ నుంచి ప్రారంభమై ఎన్జీ కళాశాల మైదానానికి చేరుకుంది. రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వివిధ రాష్ట్రాలు, తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వేలాది మంది రైతులు, కార్మికులు ఎర్ర జెండాలు చేతబట్టి ఈ ప్రదర్శనలో పాల్గొనడంతో పట్టణమంతా ఎరుపెక్కింది. ఎన్జీ కళాశాల ఆవరణలోని సభా ప్రాంగణం జనసంద్రమైంది. తెలంగాణ సాయుధ పోరాట యోధులు మల్లు స్వరాజ్యం, మల్లు వెంకట నరసింహారెడ్డి స్మారక ప్రభలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రైతు సంస్కృతిని ప్రతిబింబించేలా జాతీయ, రాష్ట్ర నాయకులు ఎడ్ల బండ్లపై నిల్చుని ర్యాలీలో పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కవాతు, కళారూపాలు
ర్యాలీలో భాగంగా రెడ్ షర్ట్ వలంటీర్లు కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకవైపు గిరిజన కళాకారుల సంప్రదాయ నత్యాలు, మరోవైపు మహిళల కోలాటాలు, ధింసా నృత్యం ర్యాలీలో నూతనోత్సాహాన్ని నింపాయి. రైతుల నినాదాలు, డప్పు చప్పుళ్లతో నల్లగొండ నగరమంతా మార్మోగింది.
ఫ ఎరుపెక్కిన నీలగిరి వీధులు
ఫ సాయుధ పోరాటం స్ఫూర్తితో రైతాంగ హక్కుల కోసం
ఉద్యమించాలని నేతల పిలుపు
ఫ భూములు పంచిన ఘనత
కమ్యూనిస్టులదే : బృందా కరత్
ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజూకృష్ణన్ మాట్లాడుతూ నల్లగొండలో జరుగుతున్న జాతీయ మహాసభల్లో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, కరువు పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుదీర్ఘంగా చర్చించి రానున్న రోజుల్లో రైతుల సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. పంటలకు మద్దతు ధరతో పాటు ఇతర సబ్సిడీలపై ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ట్రంప్ చెప్పిన విధంగా వ్యవహరిస్తూ వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతోందని, రియల్ ఎస్టేట్, కార్పొరేట్లకు రైతుల భూమిని ధారాదత్తం చేయాలని చూస్తోందని దానిపై సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే మాట్లాడుతూ తెలంగాణ పోరాటాల గడ్డపై అఖిల భారత కిసాన్ మహాసభలను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో జరిగిన ఎన్నికల్లో ప్రధాని నెహ్రూ కంటే రావి నారాయణరెడ్డి ఎక్కువ మెజార్టీ ఓట్లతో గెలిచిన చరిత్ర ఉందన్నారు.


