హుజూర్నగర్ : ప్రాథమిక పాఠశాలలకు మరణ శాసనంగా మారిన జీఓ నంబర్ 25ను వెంటనే రద్దుచేయాలని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. ఆ సంఘం జిల్లా మహాసభల్లో భాగంగా ఆదివారం హుజూర్నగర్లో నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన పీఆర్సీని తక్షణమే జూలై 2023 నుంచి అమలు చేయాలన్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలల మూసివేత, విలీనం, ఏకోపాధ్యాయ పాఠశాలల ఏర్పాటును నిలిపివేయాలని కోరారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.సోమయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం పూర్వ అధ్యక్షుడు సీహెచ్.రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు జె.యాకయ్య, జి.వెంకటయ్య, దామోదర్, ఎన్.నాగేశ్వరరావు, జె.కమల, వి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి


