కనెక్షన్లు మంజూరు.. కదలని ఆర్డర్లు! | - | Sakshi
Sakshi News home page

కనెక్షన్లు మంజూరు.. కదలని ఆర్డర్లు!

Nov 16 2026 2:44 AM | Updated on Nov 16 2026 2:44 AM

వర్క్‌ ఆర్డర్ల కోసం తిరగాల్సి వస్తోంది

సమస్య నా దృష్టికి రాలేదు

నల్లగొండ : దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా ఉంది రైతుల పరిస్థితి. వ్యవసాయానికి విద్యుత్‌ కనెక్షన్‌ వస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్న రైతులకు అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారుతోంది. ఏడాది క్రితమే వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు మంజూరైనా.. క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించేందుకు అవసరమైన వర్క్‌ ఆర్డర్లు, రిలీజ్‌ ఆర్డర్లు మాత్రం ఇవ్వడం లేదు. కనగల్‌ మండలంలో ఐదు నెలలుగా ఈ పరిస్థితి ఉంది. మరోవైపు కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులకు ఎస్టిమేట్లు రూపొందించే పనులు మాత్రం కొనసాగుతున్నాయి. ఇప్పటికే మంజూరైన కనెక్షన్లను పూర్తి చేయకుండా కొత్త దరఖాస్తులపై దృష్టి సారించడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పట్టించుకోని అధికారులు

కనగల్‌ మండలంలో గతంలో పనిచేసిన ఏఈ సస్పెన్షన్‌కు గురికావడంతో పరిపాలనా బాధ్యతల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. సబ్‌ ఇంజినీర్‌కు యాక్టింగ్‌ ఏఈగా బాధ్యతలు అప్పగించగా, మరోవైపు నార్కట్‌పల్లి ఏఈకి ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు. మండలంలో ఇద్దరు ఏఈ స్థాయిలో అధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ రైతుల సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. సబ్‌ ఇంజినీర్‌ బదిలీపై వెళ్లే నేపథ్యంలో తాను పెండింగ్‌ పనులు విడుదల చేయలేనని చెబుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఇన్‌చార్జి ఏఈ సైతం తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాధ్యత ఎవరిదో తెలియక రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మండలంలోని జి.చెన్నారం, చెట్ల చెన్నారం, ఎం.గౌరారం, దోరేపల్లి, పగిడిమర్రి, జీఎడవల్లి తదితర గ్రామాలకు చెందిన రైతులు రిలీజ్‌ ఆర్డర్ల కోసం ఎదురుచూస్తున్నారు.

వర్కర్లు లేరు.. మెటీరియల్‌ ఇవ్వడం లేదు...

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల పనులకు అవసరమైన వర్కర్లను కేటాయించకపోవడంతో విద్యుత్‌ శాఖ స్టోర్‌ నుంచి మెటీరియల్‌ డ్రా చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఫలితంగా రైతుల పొలాల్లో ఏర్పాటు చేయాల్సిన ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర విద్యుత్‌ పరికరాలను బిగించడం లేదు. వర్కర్లు, మెటీరియల్‌ అందుబాటులో లేక ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు నిలిచిపోవడంతో సకాలంలో విద్యుత్‌ సౌకర్యం అందక రైతులు నష్టపోతున్నారు.

బాధ్యత తీసుకునే వారేరి?

ఒక అధికారి హయాంలో మంజూరైన కనెక్షన్ల పనులు మరో అధికారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా కొనసాగాల్సి ఉంటుంది. కానీ బదిలీలు, ఇన్‌చార్జి బాధ్యతల పేరుతో పెండింగ్‌ పనులను పక్కనపెడితే రైతులు ఎవరిని ఆశ్రయించాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఉన్నతాధికారులు విచారణ జరిపి, పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ కనెక్షన్లకు వర్క్‌, రిలీజ్‌ ఆర్డర్లు జారీ చేసి ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు పనులు పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు.

ఫ వ్యవసాయ విద్యుత్‌

కనెక్షన్‌కు తప్పని పాట్లు

ఫ కనగల్‌ మండలంలో

ఐదు నెలలుగా రైతుల నిరీక్షణ

ఫ కార్యాలయాల చుట్టూ

రైతుల ప్రదక్షిణలు

2005 జూన్‌లో డీడీలు కట్టినం. కనెక్షన్‌ కోసం రోజుల తరబడి తిరిగినం. వెనక వచ్చిన వాళ్లకు రిలీజ్‌ చేస్తున్నారు తప్ప మమ్ముల్ని పట్టించుకోవడం లేదు. పైరవీలు చేసుకున్న వారికే పనులు అవుతున్నాయి. మా కనెక్షన్‌ గురించి మాత్రం పట్టించుకోవడం లేదు మీ సీరియల్‌ రాలేదని చెబుతున్నారు.

– సింగం నాగరాజు మారేపల్లి

కనగల్‌కు సబ్‌ ఇంజనీర్‌ ఉన్నప్పటికీ నార్కట్‌పల్లి ఏఈకి ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చాం. రిలీజ్‌ ఆర్డర్లు ఇస్తున్నారని, ఇవ్వడం లేదనేది సమస్య నా దృష్టికి రాలేదు. అలాంటిది ఏమైనా ఉంటే చర్యలు తీసుకుంటాను. రైతులకు ఇబ్బంది రానివ్వం.

– శ్రీనివాస్‌, నల్లగొండ ఎస్‌ఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement