పందిరి సాగుకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

పందిరి సాగుకు ప్రోత్సాహం

Sep 22 2026 1:42 AM | Updated on Sep 22 2026 1:42 AM

కురగాయల సాగు పెంచుతాం

యూనిట్‌కు రూ.50 వేల సబ్సిడీ

కూరగాయల సాగుకు పెంచేలా ప్రభుత్వాల నిర్ణయం

యాసంగిలోనూ సబ్సిడీ ఇవ్వనున్న ఉద్యానశాఖ

నల్లగొండ అగ్రికల్చర్‌ : కూరగాయల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. భవిష్యత్‌లో కూరగాయలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళిక రచించింది. మల్చింగ్‌ షేడ్‌ నెట్‌, శాశ్వత పందిళ్లు, బిందుతుంపర సేద్యం వంటి సదుపాయాలకు రాయితీ ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం కూరగాయలు సాగు తగ్గటంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుబడులు చేసుకోవడం ద్వారా ధరలు మండిపోయి ప్రజలపై భారం పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాయితీ ఇచ్చి పందిరి కూరగాయల సాగును ప్రోత్సహిస్తోంది.

7,700 ఎకరాల్లో కూరగాయల సాగు

ప్రస్తుత ఎల్‌నినో ప్రభావంతో ప్రభుత్వం ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా కూరగాయల సాగు కూడా చేపట్టాలని ప్రభుత్వం సూచించినా.. రైతులు అత్యధికంగా పత్తి, వరి పంటలు వైపే మొగ్గు చూపారు. ఆరుతడి పంటలు అంతంత మాత్రమే ఉండగా అందులో కూరగాయలు సాగు పెద్దగా లేదు. వానాకాలం సీజన్‌లో ఇప్పటికే ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో 7,700 ఎకరాల్లో కూరగాయల సాగు చేయించారు. వారికి అవసరమైన సబ్సిడీని ఆయా రైతులకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అందించారు.

అరెకరం ఒక యూనిట్‌..

పందిరి కూరగాయల సాగుకు కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం రాయితీ అందించనున్నాయి. పందిరి కూరగాయలకు సంబంధించి తీగజాతి కూరగాయలు ప్రధానంగా బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, కాకరకాయ, దొండకాయ, చిక్కుడుకాయతో పాటు ఇతర తీగజాతి కూరగాయల సాగుకు యూనిట్‌కు రూ.50,000 చొప్పున సబ్సిడీ అందించనున్నాయి. అరెకరాన్ని ఒక యూనిట్‌గా నిర్ధారించారు. ఒక్కో రైతుకు ఐదు ఎకరాల వరకు సబ్సిడీ ఇస్తారు అంటే ఐదు యూనిట్లకు రూపాయలు రూ.2.50 లక్షల వరకు సబ్సిడీ వస్తుంది. వచ్చే యాసంగిలో ఈ పథకాన్ని అమలు చేసేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

యాసంగిలో కూడా..

ఈ యాసంగిలో కూడా సబ్సిడీ అందించడం ద్వారా రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించేలా ఉద్యానవన శాఖ సన్నద్ధమవుతోంది. జిల్లావ్యాప్తంగా టమాటా, వంకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, ఉల్లి, దోసకాయతో పాటు చామ గడ్డ, ఆలుగడ్డ, మునుగకాయలు, తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, చుక్కకూర వంటి ఆకుకూరలను కూడా సాగు చేసేలా వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే యాసంగి సీజన్‌లో కూరగాయల సాగును విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. జిల్లావ్యాప్తంగా వానాకాలంలో 7700 ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించాం. యాసంగిలో కూడా రైతులు సబ్సిడీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని కూరగాయల సాగును పెంచాలి.

– టి.శేఖర్‌, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement