కాంగ్రెస్, బీజేపీలో ‘బీసీ’ చర్చ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎవరిని బరిలో ఉంటారన్నది త్వరలోనే తేలనుంది. మూడు ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ.. పోటీలో నిలిపే అభ్యర్థి విషయంలో ఓ స్పష్టతకు రాగా, కాంగ్రెస్ పార్టీ ఇంకా సర్వేలు చేస్తోంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విషయంలో ఆలోచనలు చేస్తోంది. ఈ నెల 28వ తేదీన ఓటర్ల జాబితా ఖరారుకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించేందుకు ప్రధాన పార్టీలు సిద్ధం అవుతున్నాయి.
అధికార పార్టీలో ఆశావహులపై సర్వే
ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది ఉన్నారు. దీంతో ఆ పార్టీ ఆశావహుల పేర్లతో సర్వే చేస్తోంది. నల్లగొండ జిల్లా నుంచి గుత్తా అమిత్‌రెడ్డి, పున్నా కైలాష్ నేత, సూర్యాపేట జిల్లా నుంచి పటేల్ రమేష్‌రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, వరంగల్ జిల్లా నుంచి సింగారపు ఇందిర, దొమ్మాటి సాంబయ్య, ఖమ్మం జిల్లా నుంచి లోకేష్‌యాదవ్ పేర్లపై చేపట్టిన సర్వే పూర్తి కావచ్చింది. ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేయడానికి ముందే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.
అభ్యర్థిపై స్పష్టతతో బీఆర్‌ఎస్
బీఆర్‌ఎస్ తరఫున పోటీలో ఉండబోయే అభ్యర్థి విషయలో ఆ పార్టీ ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో పోటీ చేసి రెండో స్థానానికి పరిమితమైన రాకేష్‌రెడ్డినే బరిలో నిలిపే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ఆయన ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. అయితే బీఆర్‌ఎస్ ఇంకా అధికారికంగా మాత్రం ప్రకటన చేయలేదు. అనధికారికంగా రాకేష్‌రెడ్డికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
బీజేపీ మెంబర్‌షిప్ డ్రైవ్
పోటీలో నిలిపే అభ్యర్థి విషయంలో బీజేపీ ఇంకా ఆలోచనలు చేస్తోంది. బీజేపీ అభ్యర్థినికి ప్రకటించకపోగా, పార్టీ పరంగానే మెంబర్‌షిప్ డ్రైవ్ చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే సీనియర్ నాయకులు గంగిడి మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు పేర్లు బీజేపీ నుంచి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వరంగల్ నుంచి రాణి రుద్రమ కూడా పోటీకి ఉత్సాహం చూపుతున్నట్లు తెలిసింది. గతంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా వరంగల్ వారికే అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఈసారి నల్లగొండ వారికే అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది.
ఫ వరంగల్–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ సర్వే
ఫ ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చిన బీఆర్‌ఎస్
ఫ బరిలో ఎవరిని నిలుపాలన్న దానిపై బీజేపీ సమాలోచన
ఫ ఓటర్ల జాబితా షెడ్యూల్ జారీతో పెరిగిన రాజకీయ వేడి
బీఆర్‌ఎస్ నుంచి ఓసీ అభ్యర్థిని పోటీలో నిలిపే అంశంపై స్పష్టత రాగా, కాంగ్రెస్, బీజేపీలో బీసీ అంశంపైనా చర్చ జరుగుతోంది. ఈ స్థానంలో ఏ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో నిలుపాలన్న విషయంలో చర్చ జరుగుతోంది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ స్థానంలో బీసీని పోటీలో నిలిపితే వరంగల్ – ఖమ్మం – నల్లగొండ స్థానంలో ఓసీకి ఇవ్వాలని, ఇక్కడ బీసీకి ఇస్తే, అక్కడ ఓసీ అభ్యర్థిని బరిలో దింపాలని రెండు పార్టీలు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.


