● ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి వసూళ్లు
● విజిలెన్స్ విచారణలో వెల్లడైన వాస్తవాలు
తిరుమలగిరి(సాగర్) : ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు విజిలెన్స్ విచారణలో తేలడంతో తిరుమలగిరి(సాగర్) మండల గృహ నిర్మాణ శాఖ ఔట్‌సోర్సింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) భుక్యా గోపిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏఈ గోపి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు డబ్బులు తీసుకున్నారని లబ్ధిదారులు రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరేషన్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ.. విజిలెన్స్ విచారణ చేపట్టింది. విచారణలో ఏఈ డబ్బులు తీసుకున్న విషయం నిజమని తేలడంతో విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అక్రమాలకు పాల్పడినందుకుగాను భూక్యా గోపిని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ఎవరు అక్రమాలకు పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఫిర్యాదులను లబ్ధిదారులు తమకు గాని, లేదా టోల్‌ఫ్రీ నంబర్ 18004251442,18005995991 లకు ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ తెలిపారు.
సమాచారం ఇవ్వని అధికారికి జరిమానా
మిర్యాలగూడ : మిర్యాలగూడ మున్సిపాలిటీలో సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం ఇవ్వని మున్సిపల్ కార్యాలయ సమాచార అధికారికి సమాచార శాఖ కమిషనర్ మెహసిన్ పర్వీన్ రూ.6 వేలు జరిమానా విధించారు. 2025 ఆగస్టులో సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు యారమాద కృష్ణారెడ్డి మిర్యాలగూడ మున్సిపల్ పరిధిలో హరితహారం పనులపై కోరిన సమాచారం సదరు అధికారి ఇవ్వలేదు. దీంతో ఆయన కమిషన్‌ను ఆశ్రయించగా దరఖాస్తుదారుకు తక్షణమే సమాచారం ఇవ్వాలని కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలను సైతం అమలు చేయకపోవడంతో రూ.6వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించడంతోపాటు సమాచారం ఇవ్వాలని ఆదేశించినట్లు యర్రమాద కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు.
శక్తి వద్దు.. పాలిటెక్నిక్ ముద్దు
రామగిరి (నల్లగొండ) : పాలిటెక్నిక్ విద్యను శక్తి శాఖలో విలీనం చేసే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ నల్లగొండ పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగులు భోజన విరామ సమయంలో బుధవారం నిరసన తెలిపారు. ‘శక్తి వద్దు – పాలిటెక్నిక్ ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్య సాంకేతిక విద్యా వ్యవస్థలో కీలకమైన భాగమని, విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ 97ను రద్దు చేయాలని, పాలిటెక్నిక్ విద్యను శక్తిశాఖ పరిధిలోకి తీసుకెళ్లే నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
అకాడమిక్ రికార్డుల డిజిటలైజేషన్
నల్లగొండ టూటౌన్ : విద్యార్థుల అకాడమిక్ రికార్డుల డిజిటలైజేషన్ చేయడం ద్వారా సురక్షితగా ఉంటాయని ఎంజీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. బుధవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని సెమినార్ హాల్‌లో నిర్వహించిన అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఏబీసీ), ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (ఏపీఏఏఆర్) అమలుపై ఒక రోజు రాష్ట్ర స్థాయి వర్క్స్ షాపును ప్రారంభించి మాట్లాడారు. యూనివర్సిటీలు, స్వయం ప్రతిపత్తి కలిగిన కళాశాలలకు ఈ వర్క్ షాపు ఎంతో ముఖ్యమైనదని తెలిపారు. ఎంజీయూ పరీక్షల కంట్రోలర్ జి.ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల కోసం ఏపీఏఏఆర్ ఐడీల సృష్టి, డిజిలాకర్ ద్వారా అకాడమిక్ సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అంజిరెడ్డి, జోనల్ కో ఆర్డినేటర్ రవి, రోహిత్, లక్ష్మీప్రభ, ప్రవళిక, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.


