మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టుకు నీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని అన్నారం గ్రామ పరిధిలోని గద్దగూడతండాలో రైతులతో ఆయన మాట్లాడారు. ఆల్మట్టి, జూరాల, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండాయని, ఇంకా వర్షాలు కురిసే అవకశం ఉందని వాతావరణ శాఖ చెప్తున్నందున సాగర్‌కు నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సీడబ్ల్యూసీలో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను పొందేందుకు ప్రయత్నించాలని సూచించారు. సాగర్ ఆయకట్టు పరిధిలో బోర్లు, బావుల ఆధారంగా వరి సాగు కొనసాగుతుందని, వర్షాభావ పరిస్థితుల్లో చెరువుల్లో నీటి మట్టం తగ్గిపోవడంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని తెలిపారు. నీటి సమస్య పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో చేపట్టే ఉద్యమాలకు రైతులు సిద్ధంగా ఉండాలన్నారు. నల్లగొండలో నిర్వహించే జాతీయ రైతు మహాసభలను విజయవంతం చేసేందుకు రైతులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్ రైతులు పాల్గొన్నారు.
ఫ జూలకంటి రంగారెడ్డి


