చిట్యాల : తమకు రావాల్సిన ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ చిట్యాల మండలం సుంకెనపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు శుక్రవారం గుండ్రాంపల్లి గ్రామంలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సీజన్‌లో భాగంగా ఈ ఏడాది మే నెలలో గుండ్రాంపల్లి పీఏసీఎస్ ద్వారా సుంకెనపల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించినట్లు పేర్కొన్నారు. పీఏసీఎస్ సిబ్బందితో పాటు రైస్‌మిల్లర్స్ కుమ్మకై ్క ధాన్యం విక్రయించిన 70 మందికి ఒక్కో రైతుకు రూ.5వేల నుంచి రూ.60 వేల వరకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు తక్కువగా జమ చేశారని వాపోయారు. కొనుగోలు సమయంలోనూ క్వింటాకు ఐదు నుంచి ఏడు కిలోల చొప్పున తరుగు తీశారని అయినప్పటికీ తమకు రావాల్సిన పెండింగ్ డబ్బులను జమ చేయడంలేదన్నారు. గుండ్రాంపల్లి పీఏసీఎస్ పరిధిలో రూ.లక్షల్లో అవినీతి జరిగిందని వెంటనే సంబంధిత శాఖ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే తనకు రావాల్సిన రూ.29,550 గురించి ప్రశ్నిస్తే పీఏసీఎస్ అధికారులు స్పందిస్తలేరని రైతు బల్గూరి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పీఏసీఎస్ సీఈఓ రాజమల్లు మాట్లాడుతూ రైతులు విక్రయించిన ధాన్యం మేరకు ట్రక్ సీట్స్ ఆధారంగానే డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కోయగూర నర్సింహ, మాజీ ఉపసర్పంచ్ బాతరాజు రవీంధర్, యాకారి నరేందర్, బీమీడీ మహేందర్‌రెడ్డి, అంబాల నర్సింహ, గుడ్డేటి శ్రీశైలం, కక్కిరేణి భిక్షం, ఆవుల మహేష్, ఆవుల అయిలయ్య, ఆవుల బాలరాజు, నరేష్, వెంకటేశం, బాలయ్య పాల్గొన్నారు.


