నల్లగొండ : స్వాతంత్య్ర వేడుకల్లో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జిల్లా పోలీస్ శాఖ ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా శుక్రవారం నల్లగొండ పట్టణంలో నాకాబందీ ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపట్టింది. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, లాడ్జీలు, హోటళ్లు, ప్రధాన కూడళ్లు, మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, వస్తువులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. లాడ్జీలు, హోటళ్లలో బస చేస్తున్న వారి వివరాలు, గుర్తింపు పత్రాలు, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్‌లలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ రద్దీ ప్రాంతాల్లో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. స్వాతంత్య్ర వేడుకలు ప్రశాంతంగా జరిగేలా అన్ని స్థాయిల్లో సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.
బాధితులకు అండగా భరోసా కేంద్రాలు
మహిళలు, బాలికలు లైంగిక హింసకు గురైన సందర్భాల్లో వారికి భరోసా కేంద్రాలు అండగా ఉంటున్నాయని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని భరోసా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడారు. కేంద్రంలో రికార్డులు పరిశీలించారు. పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా పోలీస్ అధికారులు.. అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ మంజుల, భరోసా కేంద్రం ఇన్‌చార్జి ఎస్‌ఐ అమ్రీన్, ఎస్‌ఐ గౌస్, ఏఎస్‌ఐ అబేదా, శ్రీనివాస్, భరోసా కేంద్రం కోర్డినేటర్ నళిని, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ స్వాతంత్య్ర దినోత్సవం వేళ నాకాబందీ


