ఫ నీటి అక్రమ తరలింపును ఆపాలి ఫ మాజీఎమ్మెల్యే భాస్కర్‌రావు
మిర్యాలగూడ : ప్రస్తుత వానాకాలం సీజన్‌కు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించకుంటే రైతులను సమీకరించి సాగర్ డ్యాంను ముట్టడిస్తామని బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు అన్ని డ్యాంలు నిండుగా ఉన్నాయని, శ్రీశైలం ప్రాజెక్టులో 872 అడుగుల నీరు చేరిందని తెలిపారు. ఈ దశలో అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసి సాగర్‌కు నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిర్మాణ దశలో నిర్ణయించిన ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు కేవలం విద్యుత్ ఉత్పత్తి, నీటి నిల్వ కోసమేనని, దీన్ని దృష్టిలో ఉంచుకొని సాగర్‌కు నీరు విడుదల చేయాలన్నారు. కానీ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా అక్రమంగా నీటిని తరలిస్తున్నా ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ నేతలకు సోయి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటిపై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, హతీరాం, అన్నభీమోజు నాగార్జునచారి, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, పడిగపాటి కోటిరెడ్డి, యూసుఫ్, ఇలియాస్, పాచ్చునాయక్, వినోద్, రవీందర్, షోయబ్, పద్మావతి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.


