రామగిరి (నల్లగొండ) : రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇన్షియేటివ్స్ డిపార్ట్‌మెంట్ (శక్తి శాఖ)లో విలీనం చేయొద్దని, ఆ ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండలోని పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ విలీన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సిబ్బంది అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. సాంకేతిక విద్యాభివృద్ధికి పాలిటెక్నిక్ వ్యవస్థ మూలస్తంభమని, దీనిని శక్తి శాఖలో కలపడం వల్ల విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ఒకవేళ ఈ విలీనం అమలైతే ఉద్యోగుల సేవా నిబంధనలు, పదోన్నతులు, బదిలీలు, భవిష్యత్ ఉద్యోగ భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యాపక, ఉద్యోగ సంఘాలతో సమగ్ర చర్చలు జరిపిన తర్వాతే విలీనంపై నిర్ణయం తీసుకోవాలని, ఆ లోగా పాలిటెక్నిక్ కళాశాలలను సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.


