డేటా మొత్తం యాప్‌లోనే..
నల్లగొండ : విద్యుత్ శాఖ అధికారులకు ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేస్ రికగ్నిషన్ సిస్టం) హాజరు విధానం త్వరలో అమలు కానుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. జేఎల్‌ఎం స్థాయి ఉద్యోగి నుంచి ఎస్‌ఈ వరకు అందరికీ డిజిటల్ హాజరు విధానాన్ని త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు. విధులకు హాజరు కాకుండానే పూర్తిస్థాయి వేతనాలు పొందుతున్నారనే విమర్శల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ ఉద్యోగులకు ఈ కొత్త నియమం వర్తించనుంది. మొదటగా డివిజన్, జిల్లా కేంద్రాల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టి.. రెండో విడతలో గ్రామాలకు విస్తరించేందుకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు.
రోజుకు రెండుమార్లు హాజరు.. లేదంటే సెలవే!
కొత్త విధానం ప్రకారం ఉద్యోగులు తమ వ్యక్తిగత స్మార్ట్ ఫోన్లలో ఎస్సీపీడీసీఎల్ ఎంప్లాయి పోర్టల్ నుంచి ప్రత్యేక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉద్యోగి ఐడీ, హోదా, వారు పనిచేసే లొకేషన్ వివరాలు నమోదవుతాయి. ఉదాహరణకు ఒక లైన్‌మెన్ తాను పనిచేసే పరిధిలో ఉదయం 10 గంటలలోపు మొదటిసారి, తిరిగి సాయంత్రం 6 గంటలకు రెండోసారి యాప్ ద్వారా హాజరు వేయాల్సి ఉంటుంది. రోజులో ఈ రెండుమార్లలో ఏ ఒక్కసారి హాజరు నమోదు చేయకపోయినా.. ఆ రోజును సెలవుగానే పరిగణిస్తారు. ఆలస్యంగా వచ్చినా ఆ రోజుకు వేతనం కోత పడే అవకాశం ఉంది.
పెరగనున్న జవాబుదారీతనం
సబ్ స్టేషన్లు, ఉపకేంద్రాల పరిధిలోనే డిజిటల్ హాజరు వేయాల్సి ఉండడంతో ఉద్యోగులు విధుల్లో ఉండేలా ఈ యాప్ కట్టడి చేయనుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు, సాధారణ ప్రజలకు విద్యుత్ సమస్యలు తలెత్తినప్పుడు సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే అవకాశం కలుగుతుంది. సొంత పనులపై బయటకు వెళ్లే వీలుండదు. ఈ కొత్త విధానాన్ని కొందరు ఉద్యోగులు స్వాగతిస్తుండగా, మరికొందరు అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
నల్లగొండ జిల్లాలోని మండలాల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు పక్క జిల్లాల నుంచి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ప్రతిరోజూ అప్ అండ్ డౌన్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల వారు సకాలంలో విధులకు హాజరు కావడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే, క్షేత్రస్థాయిలోని కిందిస్థాయి సిబ్బంది మాత్రం గ్రామాల్లో అందుబాటులోనే ఉంటున్నారు. ఈ కొత్త యాప్ విధానం వల్ల ఇకపై ఏ అధికారి విధుల నుంచి తప్పించుకునే వీలుండదు. యాప్‌లోనే ఉద్యోగుల వార్షిక, నెలవారీ సెలవుల వివరాలు, మిగిలిఉన్న లీవ్‌ల డేటా మొత్తం కనిపిస్తుంది.
ఫ ఉద్యోగులకు యాప్ ద్వారా హాజరు విధానం
ఫ రోజుకు రెండుమార్లు తప్పనిసరిగా నమోదు


