నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించడంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలని కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. నల్లగొండ పట్టణంలోని డైట్ కళాశాలలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆంగ్ల భాషోపాధ్యాయులకు నిర్వహిస్తున్న స్పెల్–1 శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న ఆధునిక బోధనా పద్ధతులను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థులను సమర్థవంతమైన అభ్యాసకులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యతతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ సుశీందర్ రావు, కోఆర్డినేటర్ శ్రీనివాస్‌గౌడ్, డైట్ ప్రిన్సిపాల్ నరసింహ, సెంటర్ ఇన్‌చార్జ్ రఘుపాల్‌రెడ్డి, రిసోర్స్ పర్సన్లు అనురాధ, విష్ణు, శ్రీనివాస్, ఉమాశంకర్, సత్యనారాయణ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
‘సర్’ 15లోపు పూర్తి చేయాలి
నల్లగొండ : ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన సర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. జిల్లాలో ప్రస్తుతం 48 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని, వెనుకబడిన బీఎల్‌ఓలు వెంటనే పనులు వేగవంతం చేసి రానున్న రెండు రోజుల్లో 86 శాతానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూభారతి, 13–ఏ ఫారాలు, సాధా బైనామాలకు సంబంధించిన పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో 70 గ్రామాల్లో సోమవారం నుంచి రీ–సర్వే ప్రారంభమవుతుందని, ఇందుకు జూనియర్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చి వెంటనే విధుల్లోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


