ఐటీఐలకు కొత్త కళ | - | Sakshi
Sakshi News home page

ఐటీఐలకు కొత్త కళ

Jul 11 2026 1:12 AM | Updated on Jul 11 2026 1:12 AM

పారిశ్రామిక అవసరాలకు కోర్సులు

ప్రస్తుతం జిల్లాలోని ఐటీఐల్లో ఎలక్ట్రీషియన్‌, డీజిల్‌ మెకానిక్‌, ఫిట్టర్‌ వంటి సంప్రదాయ కోర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే, ఐటీఐలను నైపుణ్య హబ్‌లుగా మార్చాలనే ప్రధాన లక్ష్యంతో.. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సరికొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన సాంకేతికతపై విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తారు. ఈ నూతన కోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రముఖ కంపెనీలలో వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు.

నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్కిల్లింగ్‌ అండ్‌ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ త్రూ అప్‌గ్రేడెడ్‌ ఐటీఐస్‌ (పీఎం సేతు) పథకం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలకు (ఐటీఐలు) కొత్త ఊపునివ్వనుంది. తెలంగాణలో 15 ప్రభుత్వ ఐటీఐలను మూడు క్లస్టర్లుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ.757 కోట్ల పెట్టుబడులు రానుండగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ బాలుర ఐటీఐ–నల్లగొండ, ప్రభుత్వ బాలికల ఐటీఐ–నల్లగొండ, ప్రభుత్వ ఐటీఐ–భువనగిరి ఎంపిక కావడం విశేషం. ఈ ప్రతిపాదనలకు నాలుగో నేషనల్‌ స్టీరింగ్‌ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐలను అత్యాధునిక నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.

రెండు క్లస్టర్లలో జిల్లా ఐటీఐలు

అపోలో మెడ్‌ స్కిల్స్‌ సంస్థ ఆధ్వర్యంలో మూడు క్లస్టర్లలో ఐటీఐలను అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్‌ పాతనగరం ప్రభుత్వ ఐటీఐ క్లస్టర్‌ కేంద్రంగా దీనికి అనుబంధంగా వరంగల్‌, నల్లగొండ ప్రభుత్వ బాలుర ఐటీఐ, వికారాబాద్‌ బాలికల ఐటీఐ, పంజాగుట్ట ప్రభుత్వ ఐటీఐలను అభివృద్ధి చేస్తారు. ఈ క్లస్టర్‌పై రూ.241.01 కోట్ల పెట్టుబడి వ్యయం చేయనున్నారు. పటాన్‌చెరువు ప్రభుత్వ ఐటీఐని కేంద్రంగా తీసుకుని షాద్‌నగర్‌, మార్‌పల్లి, నల్లగొండ ప్రభుత్వ బాలికల ఐటీఐ, భువనగిరి ప్రభుత్వ ఐటీఐలను సిద్ధార్థ ఇన్‌ఫ్రాటెక్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్నారు. దీనికి రూ.275.24 కోట్ల పెట్టుబడులు వెచ్చించనున్నారు. ఈ రెండు క్లస్టర్లలో జిల్లాలోని మూడు ఐటీఐలు ఉన్నాయి.

మారనున్న ఐటీఐల రూపురేఖలు..

పీఎం–సేతు పథకం అమలుతో ఐటీఐల్లో ఆధునిక పరిశ్రమలకు అనుగుణంగా కొత్త ట్రేడ్లు ప్రారంభం కానున్నాయి. స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌లు, డిజిటల్‌ బోధన, అత్యాధునిక యంత్రాలు, ఈవీ, రోబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఏఐ, సీఎన్‌సీ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. పరిశ్రమలతో అనుసంధానంగా అప్రెంటిస్‌షిప్‌, ఆన్‌–ది–జాబ్‌ శిక్షణ, ప్లేస్‌మెంట్‌ అవకాశాలను పెంచడంతో పాటు అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఇన్నోవేషన్‌, ఇంక్యుబేషన్‌ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఫ పీఎం–సేతు పథకం కింద ఉమ్మడి జిల్లాలోని మూడుఐటీఐల ఎంపిక

ఫ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి

ఫ సరికొత్త కోర్సులు.. వెంటనే ఉద్యోగాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement