అడుగంటిన పానగల్లు ఉదయ సముద్రం | - | Sakshi
Sakshi News home page

అడుగంటిన పానగల్లు ఉదయ సముద్రం

Jul 12 2026 3:23 AM | Updated on Jul 12 2026 3:23 AM

నీటిని తరలించడంపై కసరత్తు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లాకు ప్రధాన తాగునీటి ఆధారమైన ఉదయసముద్రంలో ప్రస్తుతం కేవలం 10 నుంచి 12 రోజులకే సరిపడా నీటి నిల్వలే మిగిలాయి. దీంతో నల్లగొండ కార్పొరేషన్‌, చిట్యా ల, నకిరేకల్‌, మోత్కూరు మున్సిపాలిటీలతో పాటు 578 పరిసర గ్రామాలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్‌పీ) ప్రధాన కాలువ లైనింగ్‌ పనులు నిలిపివేసి ఉదయ సముద్రానికి నీటిని తరలించే అంశంపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

సాగర్‌లోనూ అరకొరగానే నీటి నిల్వలు..

ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో అందుబాటులో ఉన్న నీటిని హైదరాబాద్‌కు తాగునీటిగా తరలించడంతో పాటు మిషన్‌ భగీరథ ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సరఫరా చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లో 510 అడుగుల నీటిమట్టం వరకు తాగు నీటిని తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 513 అడుగుల నీటిమట్టం ఉండటంతో అధికారులు ఉదయ సముద్రానికి నీటిని విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఉదయసముద్రం రిజర్వాయర్‌ నీటినిల్వ సామర్థ్యం 1.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం కేవలం 0.5 టీఎంసీ నీరు మాత్రమే ఉంది. అందులో 0.38 టీఎంసీల నీటినే వినియోగించుకు వీలుంది. బురద కారణంగా మిగతా నీటిని తీసుకునే పరిస్థితి ఉండదు.

వేయి క్యూసెక్కులు సరఫరా చేస్తేనే..

ప్రస్తుతం ఉదయ సముద్రానికి నీటిని సరఫరా చేయాలంటే హైదరాబాద్‌కు సరఫరా చేసే నీరు పోగా అదనంగా వేయి క్యూసెక్కులు ఎత్తిపోయాలి. ఉదయ సముద్రం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1.5 టీఎంసీకాగా, కట్ట బలహీనంగా ఉండటంతో 1.2 టీఎంసీకి మించి నీటిని నిలువ చేసే పరిస్థితి లేదు. ఆ మేరకు నీటిని నింపినా నవంబర్‌ వరకు తాగునీటి సమస్య ఉండదని అధికారులు భావిస్తున్నారు.

నిలిచిపోనున్న లైనింగ్‌ పనులు..

జిల్లాలో ప్రస్తుతం ఏఎంఆర్‌పీ ప్రధాన కాలువ లైనింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఉదయ సముద్రానికి నీటిని ఈ కాలువ ద్వారానే సరఫరా చేయాలి. ఉదయసముద్రంలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయన్న విషయం ముందగా తెలిసినా, నీటిని నింపే అంశంపై అధికారులు ముందుగా ఆలోచన చేయలేదు. లైనింగ్‌ పనులను ప్రారంభించకముందే నీటిని నింపి ఉంటే ఇబ్బంది వచ్చేది కాదు. ఇప్పుడు ఉదయసముద్రానికి నీటిని విడుదల చేయాల్సి వస్తే ఈ లైనింగ్‌కు బ్రేక్‌ తప్పదు. దీంతో లైనింగ్‌పైనా ప్రభావం ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది.

తాగునీటి సమస్యను అధిగమించేందుకు అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (ఏకేబీఆర్‌) నుంచి ఉదయసముద్రానికి నీటిని తరలించే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇరిగేషన్‌, మిషన్‌ భగీరథ, పబ్లిక్‌ హెల్త్‌ శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించి ఇప్పటికే నివేదిక సమర్పించారు. ప్రస్తుతం సాగర్‌ వెనుక జలాల నుంచి పుట్టంగండిలోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. పుట్టంగండి సిస్టరన్స్‌ వద్ద 4 మోటార్లు ఉండగా.. రెండు మోటార్ల ద్వారా ప్రస్తుతం 900 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. అందులో 550 క్యూసెక్కులకు పైగా హైదరాబాద్‌ జంట నగరాల తాగునీటి అవసరాల కోసమే సరఫరా చేస్తున్నారు.

ఫ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 1.5 టీఎంసీలు.. ప్రస్తుత నిల్వ అర టీఎంసీనే

ఫ నాలుగు మున్సిపాలిటీలు, 578 గ్రామాలకు తాగునీటి ముప్పు

ఫ ఏకేబీఆర్‌ నుంచి నీటిని తరలిందుకు కసరత్తు

ఫ నిలిచిపోనున్న ప్రధాన కాలువ లైనింగ్‌ పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement