భూ భారతి రీ సర్వే చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

భూ భారతి రీ సర్వే చేపట్టాలి

Jul 12 2026 3:23 AM | Updated on Jul 12 2026 3:23 AM

నల్లగొండ : భూ భారతి రీసర్వే చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆదేశించారు. శనివారం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ నుంచి ఆయన పాల్గొన్నారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఈ నెల 13 నుంచి నిర్దేశించిన 70 గ్రామల్లో రీ సర్వే నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజాపాలన, రెవెన్యూ సదస్సులు, ఇతర సందర్భాల్లో స్వీకరించిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొని సర్వే నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ దేవరాజ్‌, గృహ నిర్మాణశాఖ పీడీ రాజ్‌కుమార్‌, డీఈఓ సుశీందర్‌రావు పాల్గొన్నారు.

13న నులిపురుగుల

నిర్మూలన దినోత్సవం

నల్లగొండ టౌన్‌ : ఈ నెల 13న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రాహుల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు 3,90,134 మంది ఉన్నారని.. వీరి కోసం 4,17,400 ఆల్బెండజోల్‌ (400 మి.గ్రా.) మాత్రలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జూనియర్‌ కళాశాలలు, వృత్తి విద్యా కళాశాలల్లో శిక్షణ పొందిన ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య పర్యవేక్షకులు మాత్రలు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.

అనర్హులను జాబితా నుంచి తొలగించాలి

నల్లగొండ టూటౌన్‌ : నల్లగొండ నియోజకవర్గంలో అనర్హులను ఓటరు జాబితా నుంచి తొలగించి అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి శనివారం ఆర్డీఓ అశోక్‌రెడ్డిని కలిసి విన్నవించారు. సర్‌ ద్వారా నల్లగొండ నియోజకవర్గంలో ఏర్పడుతున్న సమస్యలను ఆర్డీఓ దృష్టికి తీసుకొచ్చారు. నల్లగొండలో బయటి గ్రామాలకు చెందిన వారి ఓట్లు అనేకంగా ఉన్నాయన్నారు. ఓటరు జాబితాను పారదర్శకంగా తయారు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట పార్టీ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్‌, కార్పొరేటర్‌ బానావత్‌ దీప్లా, నాయకులు గోపగాని రాజశేఖర్‌, దండంపల్లి సత్తయ్య, జంగయ్య, వివేక్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement