చెక్‌డ్యాం అనుమతుల పేరుతో
ఫ కందుకూరు చెరువు మట్టి యథేచ్ఛగా తరలింపు
డిండి : మండల పరిధిలోని కందుకూర్ గ్రామ శివారులో ఉన్న చెరువు అక్రమ మట్టి రవాణాకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. నిబంధనలకు పాతరేస్తూ, ఎలాంటి అనుమతులు లేకుండానే ఇక్కడి నుంచి యథేచ్ఛగా మట్టిని తరలించేస్తున్నారు. కందుకూర్ గ్రామ శివారులో చెక్ డ్యాం నిర్మించేందుకు ప్రభుత్వం ఇటీవల ఓ కాంట్రాక్టర్‌కు పనుల అనుమతులు మంజూరు చేసింది. అయితే ఈ పనుల ముసుగులో భారీ ఎత్తున మట్టి దందాకు తెరలేపారు. ఈ చెక్ డ్యాం నిర్మాణ పనుల నిమిత్తం అవసరమైన మట్టిని తరలించేందుకు సదరు కాంట్రాక్టర్ మైనింగ్ శాఖ నుంచి ఎటువంటి అనుమతులూ తీసుకోకపోవడం గమనార్హం. ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా, భారీ టిప్పర్ల ద్వారా చెరువులోంచి మట్టిని అక్రమంగా రవాణా చేస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్తుల వద్ద బుకాయింపు
ఈ వ్యవహారంపై గ్రామ సర్పంచ్ కొండలు, గ్రామ కార్యదర్శి స్వామి నేరుగా కాంట్రాక్టర్‌ను నిలదీశారు. మట్టి తరలింపునకు సంబంధించిన అనుమతి పత్రాలు చూపాలని గట్టిగా అడగగా.. ‘ప్రస్తుతం పనులు ప్రారంభించాం, త్వరలోనే అన్ని అనుమతులు వస్తాయి’ అంటూ ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పి దర్జాగా పనులు కొనసాగించినట్లు వారు స్పష్టం చేశారు.
రంగంలోకి దిగిన ఇరిగేషన్ అధికారులు
కందుకూర్ చెరువులోంచి విచ్చలవిడిగా కొనసాగుతున్న ఈ అక్రమ మట్టి తరలింపు వ్యవహారంపై సోమవారం ‘సాక్షి’.. ఇరిగేషన్ డీఈ హన్మంతురావును సంప్రదించి వివరణ కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘చెరువు నుంచి మట్టి తరలింపు విషయంపై మాకు ఎలాంటి ముందస్తు సమాచారం అందలేదు. ఈ విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే అక్రమ రవాణాను అడ్డుకున్నాం. ఎలాంటి అనుమతులు లేనందున, ప్రస్తుతం మట్టి తరలింపు పనులను పూర్తిగా నిలిపివేశాం’ అని ఆయన స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


