పెండింగ్ బిల్లు వచ్చే వరకు.. ట్రాక్టర్ ఇవ్వ
చందంపేట : సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి ఏడాదిన్నర కావొస్తోంది. వారి పదవీకాలం ముగిసిన తర్వాత నిబంధనల మేరకు వారి ఆధీనంలో ఉన్న ట్రాక్టర్లను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించాలి. కానీ చందంపేట మండలంలోని బుడ్డోనితండా గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ముడావత్ బాలునాయక్ ఆరు నెలలుగా గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను తన వద్దే ఉంచుకుంటున్నాడు. పంచాయతీ కార్యదర్శి వెళ్లి ట్రాక్టర్ గురించి అడిగితే.. పంచాయతీలో తాను చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. అవి వచ్చే వరకు ట్రాక్టర్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పాడు. బకాయి బిల్లులు వచ్చాక ట్రాక్టర్ ఇస్తానని అన్నాడు. ఇక, తన ఆధీనంలో ఉన్న ట్రాక్టర్ పరికరాలను సైతం మార్చాడని తెలిసింది. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి యాదగిరిని వివరణ కోరగా.. పెండింగ్ బిల్లు రానిదే.. ట్రాక్టర్ ఇవ్వను అంటున్నాడని చెప్పారు.


