నత్తనడకన ‘రైతుబంధు’.. రైతులకు తప్పని అప్పుల తిప్పలు! | Sakshi
Sakshi News home page

నత్తనడకన ‘రైతుబంధు’.. రైతులకు తప్పని అప్పుల తిప్పలు!

Published Mon, Dec 18 2023 1:32 AM

- - Sakshi

నల్లగొండ అగ్రికల్చర్‌: రైతుబంధు పథకం డబ్బుల జమ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్రక్రియను ప్రారంభించి ఐదు రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు జిల్లాలోని 86 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.20 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

అరెకరం, ఎకరం లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే రైతుబంధు డబ్బులను జమ చేసినట్లు గణాంకాలు చెపుతున్నాయి. యాసంగి సీజన్‌ ఆరంభమై నెల రోజులు దాటినా రైతుబంధు డబ్బులు అందకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం తిప్పలు పడుతున్నారు.

గత ప్రభుత్వం మాదిరిగానే..
కాంగ్రెస్‌ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాకుండా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన విధంగానే ఈ సీజన్‌లో ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయడానికి పచ్చజెండాను ఊపింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకురానున్న రైతు భరోసా పథకంపై ఇప్పటివరకు ఎలాంటి విధి విధానాలను రూపొందించలేదు.

దీని కారణంగా పాత పద్ధతినే రైతులకు డబ్బు జమచేసే ప్రక్రియను ఈ నెల 12 నుంచి ప్రారంభించింది. రంగారెడ్డి ట్రెజరీ నుంచి రైతులు దశల వారీగా డబ్బులను జమ చేస్తామని పేర్కొంది. తొలుత ఎకరం లోపు వారికి.. ఆ తర్వాత దశల వారీగా రోజుకు ఎకరం చొప్పున పెంచుతూ రెండు ఎకరాలు, మూడు ఎకరాలు, ఆ తరువాత పై ఎకరాల వారికి రైతుబంధు డబ్బులను జమచేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటించింది.

నల్లగొండలో జిల్లాలో 5.30 లక్షల మంది రైతులు రైతుబంధు పథకానికి అర్హులుగా ఉన్నారు. వారికి సంబంధించిన రూ.610 కోట్లు ఖాతాల్లో జమచేయాల్సి ఉంటుంది.

పెట్టుబడులకు తప్పని తిప్పలు
యాసంగి సీజన్‌ ప్రారంభమై నెల దాటింది. రుణమాఫీ సక్రమంగా కాకపోవడంతో బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో రైతులు పంటరుణాలు అందక, రైతుబంధు సాయం రాక పెట్టుబడల కోసం ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే రైతుబంధు డబ్బుల జమ ప్రక్రయను వేగవంతం చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు.

వానాకాలంలో కూడా కొందరికి అందలే..
గత వానాకాలంలో సీజన్‌లో కూడా వేలాది మంది రైతుల వరకు రైతుబంధు డబ్బులు జమ కాలేదు. వివిధ సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఆ సీజన్‌ ముగిసే నాటికి కూడా డబ్బులు రాకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడ్డారు.

వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగినా వారికి సరైన సమాధానం రాలేదు. ప్రస్తుత యాసంగి సీజన్‌ కూడా డబ్బుల జమ ప్రక్రియ నత్తనడకన సాగుతుండడంతో వానాకాలం పరిస్థితి ఏర్పడుతుందోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది.

దశల వారీగా జమ అవుతాయి
రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్‌ రైతుబంధు డబ్బులు జమ చేయడాన్ని ప్రారంభించింది. ముందుగా ఎకరంలోపు రైతులకు ఆ తరువాత రెండెకరాలోపు వారికి ఇలా దశవారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి రైతుకూ రైతుబంధు సాయం అందుతుంది. – పాల్వాయి శ్రవణ్‌కుమార్‌, డీఏఓ

Advertisement
 

తప్పక చదవండి

Advertisement