సీఎం సభకు వెళ్లి వస్తుండగా.. రెండు బైక్‌లు ఢీ.. యువకుడు మృతి..!

- - Sakshi

హాలియాలో సీఎం కేసీఆర్‌ సభకు వెళ్లి వస్తుండగా ఘటన

హాలియా: ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన అనుముల మండలంలోని పంగవానికుంట గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం పర్వేదుల గ్రామ పంచాయతీ పరిధిలోని సుద్దబావితండాకు చెందిన రమావత్‌ బాలు(26) మంగళవారం హాలియా పట్టణంలో జరిగిన సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యాడు.

సభ ముగిసిన తర్వాత బైక్‌పై తిరిగి వెళ్తుండగా.. అనుముల మండలంలోని పంగవానికుంట గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమావత్‌ బాలు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంపై ఎలాంటి కేసు నమోదు కాలేదని ఎస్‌ఐ శోభన్‌బాబు తెలిపారు.

మృతదేహంతో రాస్తారోకో
పెద్దవూర: రమావత్‌ బాలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతుడి కుటుంబ సభ్యులు, తండావాసులు, బంధువులు వాహనాన్ని పెద్దవూర మండల పరిధిలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద అడ్డుకున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని వాహనం నుంచి మృతదేహాన్ని కిందికి దించి రోడ్డుపై అరగంటకు పైగా రాస్తారోకో చేశారు.

దీంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. కాగా సుద్దబావితండాకు చెందిన రమావత్‌ బీమా, చంద్రకళ దంపతులకు ముగ్గురు సంతానం. రమావత్‌ బాలు పెద్ద కుమారుడు. మృతుడి తండ్రి మానసిక రోగి. బాలు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేయడంతో పాటు కూలీ పనులకు వెళ్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు.

చేతికి అందివచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వారి రోదనలు పలువురిని కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న నాగార్జునసాగర్‌ సీఐ బీషన్న ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు.

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top