అచ్చంపేట: ఇటు తెలంగాణ, అటు ఏపీ రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు, కోట్లాది మందికి తాగునీటిని అందించడంతో నిరంతర విద్యుత్ సరఫరాకు దోహదపడే శ్రీశైలం జలాశయంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఈ ఏడాది ఎల్‌నివో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడమే ఇందుకు కారణం. ఎగువ నుంచి ఆశించిన స్థాయిలో వరద ప్రవాహం లేకపోవడంతోపాటు.. వచ్చిన కొద్దిపాటి నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు విచ్చలవిడిగా తోడేస్తుండటంతో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్ దశకు చేరుకుంటున్నాయి. ప్రస్తుతం నిండా నీటితో కళకళలాడిన జలాశయం.. నీటిమట్టం వేగంగా క్షీణించి 861.10 అడుగులకు చేరింది. ప్రస్తుతం ఎగువనున్న ఆల్మటి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం లేకపోవడంతో శ్రీశైలంలో ఎండీడీఎల్ 834 అడుగుల చేరువలోకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తాగునీటికే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2002– 03 సంవత్సరం నుంచి కృష్ణానదికి అతి తక్కువ నీటి ప్రవాహాలు వచ్చిన నాలుగో సందర్భం ఇప్పుడు మళ్లీ వచ్చింది.
శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం ఇలా..
సంవత్సరం వచ్చిన వరద
(టీఎంసీలు)
2002– 03 221.781
2003– 04 157.047
2012– 13 243.852
2015– 16 73.600
2023– 24 140.840
2026– 27 215.11
(సెప్టెంబరు 17 వరకు)
10 టీఎంసీలు వాడుకున్నాం..
శ్రీశైలానికి వరదలు వచ్చిన సమయంలో ఈ ఏడాది ఇప్పటి వరకు తాగు, సాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. మూడు మోటార్ల ద్వారా రోజుకు 800 నుంచి 2,400 క్యూసెక్కుల నీటిని ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లకు తరలించాం. రిజర్వాయర్లతోపాటు డిస్ట్రిబ్యూటరీ కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తున్నాం. – అమర్‌సింగ్, ఈఈ, సాగునీటి పారుదలశాఖ
విచ్చలవిడిగా వాడకం..
కృష్ణానది పరివాహకంలో కురిసిన వర్షాలతో మహారాష్ట్రలోని ఉజ్జయిని, కర్ణాటకలోని ఆల్మటి, నారాయణపూర్ జలాశయాలు నిండిన తర్వాత విడుదల చేసిన నీళ్లు గత జూలై చివరి నాటికి జూరాల మీదుగా శ్రీశైలానికి చేరుకున్నాయి. దీంతో వానాకాలం ప్రారంభానికి ముందు శ్రీశైలంలో 39 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ఆగస్టు 12 నాటికి ఎగువ నుంచి 185.5 టీఎంసీల నీరు వచ్చింది. దీంతో శ్రీశైలంలో 215.11 టీఎంసీల నీరు చేరగా.. తెలంగాణ కేఎల్‌ఐ, ఏపీ పోతిరెడ్డిపాడు, మల్యాల నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్), వెలుగోడు, ముచ్చుమర్రి పథకాలకు వాడుకుంటోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు శ్రీశైలం నుంచి ఇప్పటి వరకు 145 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు శ్రీశైలం గేజింగ్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు రెండు రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుదుత్పత్తి ద్వారా పెద్దఎత్తున నీటిని దిగువనున్న నాగార్జునసాగర్‌కు విడుదల చేశాయి. తెలంగాణ శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా తెలంగాణ జెన్‌కో 446.13 మి.యూ., ఏపీ 72.62 మి.యూ., విద్యుదుత్పత్తి చేసింది. నీటి కేటాయింపులు లేకుండానే రెండు రాష్ట్రాలు నీళ్లు వాడుకుంటున్నాయి. ప్రస్తుతానికి వచ్చిన వరదలతో కాస్త ఉపశమనం పొందినా భవిష్యత్ పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీశైలంలో అతి తక్కువ నీటిమట్టం
ప్రస్తుతం జలాశయంలో 861.10 అడుగుల 109.5400 టీఎంసీల నీరు
డేంజర్ బెల్స్.. ఎండీడీఎల్‌కు కేవలం 79.5400 అడుగులే
ఇలాగే కొనసాగితే సాగు, తాగునీటిపై తీవ్ర ప్రభావం
వచ్చే జూన్ వరకు తాగునీటికే ప్రాధాన్యం అంటున్న ప్రభుత్వం


