కొల్లాపూర్: బీఆర్‌ఎస్ నేత, మాజీమంత్రి హరీశ్‌రావు బుధవారం కొల్లాపూర్ మండలంలోని సింగోటం గ్రామానికి రానున్నారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి మృతి చెందడంతో హర్షవర్ధన్‌రెడ్డిని పరామర్శించేందుకు ఆయన సింగోటం వస్తున్నట్లు బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.
మెస్ డిపాడిట్ చార్జీలు తగ్గించాలి
కొల్లాపూర్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని పీజీ కళాశాలల్లో పెంచిన మెస్ డిపాజిట్ చార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ కొల్లాపూర్‌లో పీజీ కళాశాల విద్యార్థులు మంగళవారం ప్రిన్సిపల్ అశోక్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కొల్లాపూర్ పీజీ కళాశాలలో ఇప్పటి వరకు మెస్ డిపాజిట్ చార్జి ఏడాదికి రూ.10 వేలు మాత్రమే ఉండేదన్నారు. అయితే ఇటీవల యూనివర్సిటీ అధికారులు మెస్ డిపాజిట్ చార్జీలు అబ్బాయిలకు రూ.18,100, అమ్మాయిలకు రూ.16,100కు పెంచారని, దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. మెస్ డిపాజిట్ చార్జీల పెంపు కారణంగా కొల్లాపూర్ పీజీ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు. యూనివర్సిటీ ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా మెస్ డిపాజిట్ చార్జీలు నిర్ణయించాలని కోరారు.
27న పాదయాత్ర
చారకొండ: డిండి లిప్టు ఇరిగేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో ఉల్పర నుంచి కల్వకుర్తి వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, కన్వీనర్ రాఘవచారి తెలిపారు. మండలంలోని ఎర్రవల్లిలో డీఎల్‌ఐకి వ్యతిరేకంగా, ముంపు గ్రామాలను మినహాయించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరసన దీక్షలు 295వ రోజుకు చేరాయి. ఈ మేరకు మంగళవారం పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ దీక్షలకు మద్దతు తెలిపి మాట్లాడారు. డీఎల్‌ఐ రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. పాదయాత్రకు పాలమూరు అధ్యయన వేదిక రాష్ట్ర కన్వీనర్ హరగోపాల్, ఎమ్మెల్సీ కోదండరాం హాజరవుతారని వెల్లడించారు. అదేరోజు సాయంత్రం కల్వకుర్తిలో బహిరంగ సభ నిర్వహిస్తామని, రైతులు, మేధావులు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రానీయొద్దు
కందనూలు: మండలంలోని గుడిపల్లి పరిధి గౌరిదేవిపల్లిలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పంపుహౌస్‌ను ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. అనంతరం అధికారులతో నీటి సరఫరాలో సమస్యలపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తక్కువ నీటి సరఫరా ఎందుకు జరుగుతోందనే అంశంపై డీఈ సుదర్శన్, ఏఈ శోభన్‌తో తెలుసుకున్నారు. నీటి సరఫరాలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, పైప్‌లైన్ పరిస్థితి, నీటి పంపింగ్ సామర్థ్యం, సరఫరాలో అంతరాయాలకు గల కారణాలపై ఆరాతీశారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


