కల్వకుర్తి రూరల్: తీవ్ర వర్షాభావం పరిస్థితులతో పంటలు ఎండిపోతున్నాయని.. నాగర్‌కర్నూల్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు డిమాండ్ చేశారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన పార్టీ డివిజన్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. వర్షాలు లేక రైతులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు రూ. 500కోట్ల కరువు సాయం కేటాయించాలని కోరారు. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు సహాయక చర్యలు చేపట్టడంతో పాటు ఎండిపోయిన పంటలను సర్వే చేసి, బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.ఆంజనేయులు, సి.ఆంజనేయులు, ఏపీ మల్లయ్య, పరశురాములు, బాలస్వామి, తారాసింగ్, శివరాములు, చెన్నయ్య ఉన్నారు.
విద్యాభివృద్ధికి
కృషి చేయాలి
తెలకపల్లి: ప్రతి మండలంలో మూడు తెలంగాణ పబ్లిక్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని బీసీటీఏ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్, ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, ఉపాధ్యక్షులు సుబ్బయ్య, మధుసూదన్, కృష్ణప్రసాద్ అన్నారు. ఆదివారం వారు మాట్లాడుతూ ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆంగ్లభాష నైపుణ్యాలు, ఇతర ఆధునిక విద్య సదుపాయాలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు.
సమాజ సేవలో భాగస్వాములు కావాలి
కందనూలు: యువత సమాజ సేవలో భాగస్వాములు కావాలని అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో కొల్లాపూర్ ఎక్స్‌రోడ్ అసోసియేషన్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఆయన హాజరై మాట్లాడారు. రక్తదానంతో ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు. యువత రక్తదానంపై మరింత అవగాహన పెంచుకొని స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. కొల్లాపూర్ ఎక్స్‌రోడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వినాయక మండపం వద్ద రక్తదాన శిబిరం, నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. శిబిరంలో మొత్తం 38 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ సాయిబాబు, సభ్యులు రమేశ్‌రెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు శివశంకర్‌రెడ్డి, వ రుణ్, సందీప్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, అరుణ్ సాయి, నర్సింహ, అమరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మైసమ్మ జాతరకు తగ్గిన భక్తులు
పెద్దకొత్తపల్లి: మండలంలోని నాయినిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు తక్కువ సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున కురిసిన వర్షానికి రైతులు, వ్యవసాయ కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావడంతో భక్తులు తక్కువగా వచ్చారు. దీంతోపాటు వినాయకుడి నిమజ్జనాలు కూడా ఉండటంతో కేవలం 3 వేల మంది భక్తులు మాత్రమే అమ్మవారిని దర్శించుకొని, మొక్కులు తీర్చుకున్నట్లు ఎండోమెంట్ అధికారులు పేర్కొన్నారు. భక్తుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులు లేక ఖాళీగా వెళ్లడం, జాతరలో ఏర్పాటు చేసిన గుడారాలకు గిరాకీ లేకపోవడంతో దుకాణాలు వెలవెల పోయాయి.


