కోస్గి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లయి రెండు ప్రభుత్వాలు ఏర్పడినా.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేటికీ సాగునీటి గోస తప్పలేదని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యమనే నినాదంతో ఆదివారం కోస్గిలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె మాట్లాడారు. గతంలో కొడంగల్ గడ్డపైకి వచ్చి చంద్రబాబు సీఎం అయ్యారు.. రేవంత్‌రెడ్డి వచ్చి సీఎం అయ్యారు.. తాను సైతం కొడంగల్ ప్రజల ఆశీర్వాదంతో కోస్గికి వచ్చానని.. టీఆర్‌ఎస్‌కు అధికారమిచ్చి సీఎం చేయాలని కోరారు. తాను పార్టీ పెట్టడం గిట్టని కొందరు బీఆర్‌ఎస్ వదిలిన బాణం అని, మరికొందరు రేవంత్ వదిలిన బాణమని, తలకాయలేని మరికొందరు బీజేపీ వదిలిన బాణమంటూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎవరు వదిలిన బాణం కాదని.. నేటికీ విద్య, వైద్యానికి నోచుకోని బహుజనులు వదిలిన బాణన్నని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి తప్పించుకు తిరుగుతున్నారని.. సీఎం సొంత నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లకు కమీషన్లు వసూలు చేస్తున్నారని, ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి గెలిచిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి దందాల్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. అందరూ ఆశీర్వదిస్తే తెలంగాణలో సైతం మాతృస్వామ్య పాలన చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజ ప్రభాకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
● నేను బహుజనుల బాణాన్ని..
● కోస్గి పాంచజన్య సంకల్పసభలో టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత


