కందనూలు: బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్ తమ మాటలను వక్రీకరించి మాట్లాడటం తగదని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, తాను అసెంబ్లీలో నియోజకవర్గ అంశాలపై జీరో అవర్‌లో మాట్లాడటం జరిగిందన్నారు. అయితే అచ్చంపేట నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తాను మాట్లాడినట్లు.. రైతుల పంటలకు కరెంటు ఇవ్వాలని ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి అన్నారని ఇటీవల పెబ్బేరులో కేటీఆర్ మాట్లాడటం సరైంది కాదన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో మిషన్ భగీరథ పేరుతో రూ.వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ విమర్శలు కాకుండా.. బీఆర్‌ఎస్ పాలనలో ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం లేకపోయేసరికి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో మాట్లాడుతున్న మాటలను ప్రజలందరూ గమనిస్తున్నారని.. సమయం వచ్చినప్పుడు వారు తగిన బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో మున్సిపల్ చెర్మన్ తీగల సునేంద్ర, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జక్కరాజు, అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయకుమార్‌రెడ్డి, వంకేశ్వరం నిరంజన్ ఉన్నారు.


